కోడ్ కూసినా.. తెలంగాణలో కనిపించని పొలిటికల్ హీట్!

ఒకసారి టికెట్ ఫైనల్ అయి.. అభ్యర్థిగా ప్రకటనలు వచ్చేస్తే.. ప్రచారం మీద ఫోకస్ చేయాలన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు.;

Update: 2023-10-25 04:28 GMT

ఎన్నికలు వస్తున్నాయంటేనే రాజకీయం రగులుకుంటుంది. పోటాపోటీ యాత్రలు.. హామీలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఆరోపణలు.. ఇలా రాజకీయం రణరంగంగా మారుతుంటుంది. అయితే.. రోటీన్ కు భిన్నంగా ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం స్తబ్దుగా మారటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోడ్ కూసి ఇన్ని రోజులైన తర్వాత కూడా రాజకీయంలో చురుకు లేకపోవటం ఒక ఎత్తు అయితే.. ఎందుకిలా? అన్నది ప్రశ్నగా మారింది.

కోడ్ కూయటానికి ముందు అధికార బీఆర్ఎస్ తన అభ్యర్థుల్ని డిసైడ్ చేయటం.. బరిలో పాత వారే తప్పించి.. కొత్త వారు చాలా తక్కువగా ఉండటం ఒక ఎత్తు అయితే.. వారికి పోటీగా బరిలోకి దిగాల్సిన కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థుల లెక్క తేలకపోవటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన ఆశావాహులు ఇప్పటికి టికెట్లను దక్కించుకునే ప్రయత్నంలో మునిగి ఉన్నారు.

ఒకసారి టికెట్ ఫైనల్ అయి.. అభ్యర్థిగా ప్రకటనలు వచ్చేస్తే.. ప్రచారం మీద ఫోకస్ చేయాలన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు. టికెట్ రేసులో ఉండి.. నియోజకవర్గంలో హడావుడి చేసి.. తీరా టికెట్ రాకపోతే పరువు పోతుందన్న ఉద్దేశంతో ఎవరికి వారు కాస్తంత సంయమనాన్ని పాటిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు అధికార పార్టీ ఆర్థిక వనరులతో పోలిస్తే.. తమ వద్ద ఉన్న వనరులు తక్కువగా ఉండటం మరో కారణంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. అధికార పార్టీ నేతలు సైతం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తొందరపడి పంపిణీ కార్యక్రమాన్ని షురూ చేస్తే.. దాన్ని ఆపటం కష్టంగా ఉంటుందని.. ప్రత్యర్థుల లెక్క తేలిన తర్వాత ప్రచార వేగాన్ని పెంచాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు.. వారికున్న పరిమితులు తెలంగాణలో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించే విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి పార్టీల అభ్యర్థుల జాబితాలు వచ్చేస్తాయని.. ఆ వెంటనే రాజకీయ వేడి రగులుకోవటం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News