కూటమి అలెర్ట్ ....జగన్ గుర్తించలేకపోతున్నారా ?
ప్రజల నాడిని ఇపుడు పట్టుకోవడం బహు కష్టం. ఎందుకంటే ముతక భాషలో చెప్పాలీ అంటే జనాలు తెలివి మీరిపోయారు అనాలేమో.
ప్రజల నాడిని ఇపుడు పట్టుకోవడం బహు కష్టం. ఎందుకంటే ముతక భాషలో చెప్పాలీ అంటే జనాలు తెలివి మీరిపోయారు అనాలేమో. ఎందుకంటే జనాలు ఈ రోజు స్మార్ట్ ఫోన్ల యుగంలో ఉన్నారు. సోషల్ మీడియాతో అనుసంధానం అయి ఉన్నారు. ఒక్కొక్కరూ చేసే రాజకీయ విశ్లేషణలు తలపండిన వారిని సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. జనాలకు ఏమి కావాలి, వారి సంతృప్తి స్థాయి ఏమిటి తాము చేసిన కార్యక్రమాలతో జనాలు తిరిగి అందలం దక్కిస్తారా ఇవన్నీ రాజకీయ పార్టీలకు ఉండే ప్రశ్నలు. అయితే జవాబులు కూడా అందులోనే ఉన్నాయి. జనాలు ఎన్ని చేసినా తమకు నచ్చకపోతే ఓడిస్తున్నారు. ఇక చేతికి ఎముక లేకుండా సంక్షేమ పధకాలను ఇచ్చిన పార్టీలను సైతం ఇళ్ళకు పంపించిన ఘనత జనాలదే. దాంతో జనాలను ఎలా మచ్చిక చేసుకోవాలన్నది రాజకీయ ఉద్ధండులకు అర్ధం కాని విషయంగా మారింది.
సంక్షేమం మంత్రం కాదు :
మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్నది ఒకప్పటి వ్యవహారం. ఇపుడు ఓట్లు రాలవు అన్నది అంతే సత్యం. దాదాపుగా ఆరు కోట్ల ఓటర్లు ఉన్న తమిళనాడులో 2026 జనవరిలో నూటిని తొంబై శాతం కుటుంబాలకు ఒక్కొక్కరికీ ఆరేడు వేల రూపాయల విలువ చేసే కానుకను డీఎంకే ప్రభుత్వం అందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిష్టాత్మకంగా దీనిని తీసుకుని మరీ అమలు చేశారు. తమిళనాడులో పొంగల్ వేళ ప్రతీ ఇంట్లో అంతా ఆనందంగా ఉండాలని ఇలా భారీ ఎత్తున వందల వేల కోట్లు వెచ్చింది డీఎంకే ప్రభుత్వం భారీ సంక్షేమం అమలు చేసింది. మేలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా ఈ విధంగా చేసింది అని కూడా చెప్పుకోవాలి. తీరా చూస్తే ఫలితం రివర్స్ కొట్టింది. డీఎంకే ఓటమి పాలు అయింది. మరి సంక్షేమానికి ఓట్లు రాలాలి కదా. కాస్తా వెనక్కి వెళ్తే 2019లో చంద్రబాబు ప్రభుత్వం కూడా పసుపు కుంకుమ అంటూ సంక్షేమ పధాలాను పోలింగ్ వేళ అందచేసింది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమిని మూటకట్టుకుంది.
జగన్ సంగతి చూసినా :
అంతవరకూ ఎందుకు జగన్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకూ రెండవ మాట రెండవ ప్రొగ్రాం అన్న ఊసు లేకుండా బటన్ నొక్కుతూ అనేక సంక్షేమ పధకాలను అమలు చేసింది. జగన్ స్వయంగా చెప్పుకున్నట్లుగా ఏకంగా రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పధకాల కోసం ఖర్చు చేశారు. అప్పు చేసి మరీ సంక్షేమాన్ని నడిపించారు. తీరా చూస్తే 2024 ఎన్నికల ఫలితాలలో వైసీపీ బోల్తా కొట్టింది. ఏకంగా 11 సీట్లకే జనాలు పరిమితం చేశారు. తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేసినా మూడవసారి గెలుపు దక్కలేదు. అంటే సంక్షేమం ఒక్కటే ఓట్లు రాల్చదు అన్నది బాగా అర్ధం అవుతోంది అని అంటున్నారు.
పవన్ చెప్పింది ఇదే :
ఈ మధ్య కాకినాడ సభలో పవన్ మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. జనాలకు అభివృద్ధి కూడా కావాలని అన్నారు. సంక్షేమం చేస్తూ పోతే అదే గెలిపించదని జగన్ విషయాన్ని ఆయన ఉదహరించారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ విషయంలో అలెర్ట్ గానే ఉంది అని అర్ధం అవుతోంది. ఇక సూపర్ సిక్స్ హామీలతో 2024 ఎన్నికలకు వెళ్ళిన కూటమి ఘన విజయనం సాధించింది. అయితే కేవలం సూపర్ సిక్స్ హామీలే గెలిపించాయని చెప్పడానికి లేదు, అభివృద్ధి లేమి ఏపీకి రాజధాని లేకపోవడం, ఉద్యోగాల కల్పన లేకపోవడం మౌలిక సదుపాయాల లోపం ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వం తప్పిదాలుగా జనాలు భావించి ఆయన్ని ఓడించారు అన్న విశ్లేషణలు ఉన్నాయని అంటున్నారు.
వైసీపీ రెండవ వైపు :
ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు అదే సమయంలో తాము ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పధకాలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అవుతున్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో కూటమి నుంచి మరిన్ని సంక్షేమ పధకాలు అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశాలు మాత్రం లేవని అంటున్నారు. ఇప్పటికి ఇస్తున్న పధకాలనే 2029 దాకా కంటిన్యూ చేస్తారు అని చెబుతున్నారు. అదే సమయంలో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసి జనం ముందు పెట్టాలని చూస్తున్నారు. దానితోనే 2029 ఎన్నికల్లో గెలవాలని కూడా భావిస్తున్నారు. ఇలా కూటమి ఫుల్ అలెర్ట్ గా ఉంటే వైసీపీ మాత్రం ఇంకా సంక్షేమం మీదనే ఫోకస్ పెడుతోంది. అభివృద్ధి అజెండా అన్నది ఆ పార్టీ ఎత్తుకోవడం లేదని అంటున్నారు. తాము వస్తే ప్రాంతాల వారీగా ఏమి చేస్తామన్నది చెప్పడం లేదని అంటున్నారు. ముఖ్యమైన రాజధాని విషయంలో తరచూ అభిప్రాయాలను మార్చుకోవడం వల్ల కూడా అది వైసీపీకి బూమరాంగ్ అవుతుందని అంటున్నారు.