ఉప ప్రధానిగా అమిత్ షా ?
దేశంలో దాదాపుగా పాతికేళ్ళ తరువాత ఉప ప్రధాని పదవి భర్తీ కాబోతోంది. అది కూడా బీజేపీ జమానాలో కావడం విశేషం.
దేశంలో దాదాపుగా పాతికేళ్ళ తరువాత ఉప ప్రధాని పదవి భర్తీ కాబోతోంది. అది కూడా బీజేపీ జమానాలో కావడం విశేషం. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయని పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్రంలో అనూహ్యంగా అతి పెద్ద మార్పు జరగబోతోంది అని అంటున్నారు. అదే కేబినెట్ లో నంబర్ టూ ర్యాంకులో ఉన్న అమిత్ షా ఇక ప్రధాని మోడీ తరువాత అన్నట్లుగా ఏకంగా ఉప ప్రధాని కాబోతున్నారు అని అంటున్నారు. ఈ మేరకు హస్తినలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
సరిగ్గా పాతికేళ్ళ క్రితం :
ఇప్పటికి దాదాపుగా పాతికేళ్ళ క్రితం 2002లో అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్ కే అద్వానీని ఆనాటి ఎన్డీయే ప్రధానమంత్రి వాజ్ పేయి ఉప ప్రధానిగా నియమిస్తూ పదోన్నతి కల్పించారు. దాంతో వాజ్ పేయ్ తరువాత అద్వానీ ప్రధాని రేసులో ఉంటారని పార్టీతో పాటు దేశంలోని అందరికీ సంకేతాలు బలంగా వెళ్ళాయి. 2024 వరకూ రెండేళ్ళ పాటు అద్వానీ ఈ కీలకమైన పదవిని నిర్వహించారు. ఇక ఆ తరువాత పదేళ్ళ పాటు యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఉప ప్రధాని ఎవరూ లేరు, మన్మోహన్ సింగ్ మాత్రమే ప్రధానిగా కనిపించారు. ఇక 2014 నుంచి ఈ రోజు దాకా పన్నెండేళ్ళ పాటు మోడీ ప్రధానిగా ఉన్నారు. కానీ ఉప ప్రధాని అన్న ఊసే లేదు, కానీ మొదటిసారిగా మోడీ ప్రభుత్వంలో ఆ ప్లేస్ భర్తీ కాబోతోంది అని ప్రచారం అయితే సాగుతోంది.
ఆయన పాత్ర మరింతగా :
ఇదిలా ఉంటే అమిత్ షా ఇపుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనో అత్యంత బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన మోడీకి అన్ని విధాలుగా సహరిస్తూ వస్తున్నారు. ఆయన ఏడేళ్ళుగా హోం మంత్రిగా పనిచేశారు. దేశంలో అత్యధిక కాలం హోం మంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన పేరు మీదనే ఉంది. మరో మూడేళ్ళు కూడా ఆయన ఈ పదవిలో ఉంటారు. అయితే ఇపుడు ఉప ప్రధానిగా అమిత్ షాకి ప్రమోషన్ ఇస్తారని వస్తున్న వార్తలు అయితే రాజకీయంగా కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల కోసమా :
బీజేపీలో మోడీ అమిత్ షా ద్వయమే సర్వం సహా అన్నట్లుగా ఉన్నారని చెబుతారు. మోడీ మూడు సార్లు ప్రధానిగా చేశారు. 2029లో కూడా బీజేపీ గెలవాలని చూస్తోంది. అయితే నాలుగవ సారి బీజేపీ గెలిస్తే ఎవరు ప్రధాని అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. మోడీయే ఉంటారు అని అంటున్నా ఆ సమయానికి ఆయన 79 ఏళ్ళకు చేరువ అవుతారు. బీజేపీలో 75 ఏళ్ళు దాటిన వారు తప్పుకోవాలని నియమం వారికి వారే విధించుకున్నారు. కానీ మోడీకి గత ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 75 క్రాస్ చేశారు. అయితే మోడీ కొనసాగాల్సిన అవసరం ఉందని అంతా భావించారు. దాంతో ఆయనకు ఈ నిబంధనలు వర్తించలేదు అంటారు. అయితే 2029 లో మరోసారి బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ కంటినూ అవుతారా అన్న చర్చ కూడా ఉంది.
రేసులో పేర్లు చూస్తే :
ఇదిలా ఉంటే ప్రధాని రేసులో అనేకమంది పేర్లు రేసులో ఉన్నాయి. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ ఇందులో మొదటి వరసలో ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి వారు కూడా ఉన్నారు. అయితే వీరందరి కంటే ఎక్కువగా వినిపించే పేరు అమిత్ షా. ఆయన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో అన్నీ తానే అయి ఉన్నారు. మరి ఈ బలమైన సంకేతాన్ని సందేశాన్ని ఇచ్చేందుకే ఉప ప్రధానిగా అమిత్ షాని ప్రమోట్ చేస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది. మరి అమిత్ షాకి ఉప ప్రధాని ఇస్తారా లేక అది ఒట్టి ఊహాగానమా అన్నది తేలాలి అంటే వేచి చూడాల్సి ఉంది.