జనసేన కొత్త రూపులోకి....పవన్ సీరియస్ గానే !
జనసేన మీద ఇప్పటిదాకా విమర్శలు ఉన్నాయి. పార్టీని అభివృద్ధి చేయడం లేదని, అన్ని స్థాయిలలో పార్టీ బాధ్యులను నియమించడం లేదని అంటూ వచ్చారు.
జనసేన మీద ఇప్పటిదాకా విమర్శలు ఉన్నాయి. పార్టీని అభివృద్ధి చేయడం లేదని, అన్ని స్థాయిలలో పార్టీ బాధ్యులను నియమించడం లేదని అంటూ వచ్చారు. సంస్థాగతంగా పార్టీని ఎందుకు బలోపేతం చేయడం లేదని కూడా అంటున్న వారు ఉన్నారు. జనసేన పెట్టి పుష్కర కాలం గడచింది కదా పార్టీని ఇప్పటికైనా పటిష్టం చేయాలి కదా అని కూడా నిందించే వారు ఉన్నారు. అయితే ఇపుడు ఆ విమర్శలకు అన్నింటికీ చెక్ పడబోతోంది. పవన్ చాలా సీరియస్ గానే సంస్థాగతమైన వ్యవహారాల విషయంలో ఉన్నారు. టాప్ టూ బాటమ్ జనసేనను గట్టిగా నిలబెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఇపుడు భారీ స్థాయిలో కసరత్తు సాగుతోంది.
అన్ని పార్టీలకు భిన్నంగా :
జనసేన మిగిలిన పార్టీలకు భిన్నంగా ఈ విషయంలో వ్యవహరిస్తోంది అని చెప్పాలి. ఒక విధంగా ప్రజాస్వామ్య యుతంగా కొత్త పద్ధతిలో తన పార్టీ బాధ్యులను నియమిస్తోంది. మొత్తం 28 జిల్లాలకు సంబంధించి పార్టీ సీనియర్లతో కమిటీలు వేసి వారి నుంచి ప్రతీ నియోజకవర్గం ప్రతీ మండలం అలాగే ప్రతీ పంచాయతీ ఇలా అన్ని స్థాయిలలో పార్టీ కోసం పనిచేసేందుకు ఆసక్తి అనుభవం సమర్ధత ఉన్న వారు వాలంటరీగా తమ అర్హతలతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వాటిని ఈ నెల 5వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించే కార్యక్రమం ముమ్మరంగా చేశారు. ఈ రకంగా ఓపెన్ గా పిలిచిన పార్టీ నియామకాల కోసం పెద్ద ఎత్తున జనసేన నుంచి స్పందన లభించింది. అన్ని చోట్ల నుంచి వెల్లువలా దరఖాస్తులు వచ్చి చేరాయి.
రెండు వారాల పాటు స్క్రూటినీ :
ఇక ఏపీలో అన్ని జిల్లాల నుంచి మొత్తం ఏడు రోజుల పాటు ఈ విధంగా పార్టీ నియామకాలకు సంబంధించి ఆహ్వానించిన దానికి ఏకంగా 35 వేల పై దాటి దరఖాస్తులు వచ్చాయని జనసేన కేంద్ర కార్యాలయం తెలిపింది. వీటిని రెండు వారాల పాటు స్క్రూటినీ చేసి పూర్తి స్థాయిలో అన్నీ పరిశీలించి సమర్ధులు అయిన వారిని ఆయా చోట్లకు బాధ్యులుగా ఎంపిక చేయాలని జనసేన అధినాయకత్వం నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీలోగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుందని కూడా పార్టీ పేర్కొంది.
పంచాయతీ నుంచి పార్లమెంట్ :
ఇక ఈ మొత్తం పార్టీ పదవులు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా నియామకాలు ఉంటాయని పార్టీ స్పష్టం చేసింది. అంతే కాదు ఆగస్టు 15 నాటికి ప్రతీ పల్లెలోనూ జనసేన నుంచి కొత్తగా నియమితులు అయిన పార్టీ బాధ్యులే జెండా ఎగరేయబోతున్నారు అని పేర్కొంది. దాంతో జనసేనలో కొత్త కళ కనిపించనుంది అని అంటున్నారు. ఇక పార్టీ సస్థాగతంగా ఇంత ధీటుగా నియామకాలు జరిపిన తరువాత వచ్చే మొట్టమొదటి ఎన్నికలు స్థానిక సంస్థలు. కొత్తగా పార్టీ పగ్గాలు అందుకుంటున్న వారికి ఇది తొలి పరీక్ష అన్న మాట. వాటిలో అంతా పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని అధినాయకత్వం కోరుకుంటోంది. ఆ తరువాత 2029 టార్గెట్ గా జనసేన మరింతగా గ్రౌండ్ లెవెల్ లో పాతుకుని పోవడానికి తగిన యాక్షన్ ప్లాన్ ని కూడా రెడీ చేసింది అని అంటున్నారు.