లోకల్ ఫైట్ లో టోటల్ కూటమికే...వైసీపీకి బిగ్ చాలెంజ్ ?
మొదట మునిసిపాలిటీస్ తోనే మొదలెట్టి ఆ మీదట జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, చివరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు.
ఏపీలో తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మాటలు అన్నది అధికారికంగా ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శంఖారావాన్ని పూరించారు. కుప్పంలో పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అవుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇచ్చిన ఈ పిలుపు ఏపీలోని మొత్తం పార్టీ క్యాడర్ కి అని అర్ధం చేసుకోవాలి. త్వరలో వస్తున్న లోకల్ బాడీ ఎన్నికల్లో టోటల్ గా కూటమి అభ్యర్ధులే అన్ని సీట్లూ గెలుచుకోవాలని బాబు స్పష్టం చేశారు.
వాష్ ఔట్ అన్నట్లుగానే :
ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే 125 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అలాగే 17 దాకా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. 78 మున్సిపాలిటీలు, 30 నగర పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీఎ పరిపాలన నిర్వహణ కోసం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్రంలోని 28 జిల్లాలకు విభజించారు. ఇక ఇవి కాకుండా గ్రామీణ స్థాయిలో 13,324 గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. అలాగే 28 జిల్లా పరిషత్తులు, 685 మండల ప్రజా పరిషత్‌లు విస్తరించి ఉన్నాయి. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మధ్య స్థాయి సంస్థలైన మండల పరిషత్తులు వాటితో పాటు జడ్పీటీసీలు అంతే సంఖ్యలో ఉన్నాయి. ఇలా చూస్తే వేలాది పదవులు ఉన్నాయి. వీటికి అన్నింటికీ ఎన్నికలు దశల వారీగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
మునిసిపాలిటీస్ తోనే :
మొదట మునిసిపాలిటీస్ తోనే మొదలెట్టి ఆ మీదట జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, చివరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. ఇక పంచాయతీలకు తప్పించి మిగిలిన అన్నింటికీ పార్టీ గుర్తులు ఉంటాయి. పంచాయతీలలో కూడా పార్టీలు మద్దతు ఇచ్చి అభ్యర్ధులను నిలబెడతాయి. ఆ విధంగా చూస్తే ఏ పార్టీ మద్దతుతో సర్పంచులు ఎన్నిక అయ్యారు అన్నది కూడా తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా రెండున్నరేళ్ళ తమ పాలనకు తిరుగులేదని చాటి చెప్పాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. దాని కోసం గట్టిగానే కసరత్తు చేస్తోంది. కూటమిలో జనసేన బీజేపీ కూడా ఇదే అదనుగా తమ సొంత బలం పెంచుకోవాలని చూస్తున్నాయి.
దసరా తరువాతనే :
ఏపీలో దసరా అక్టోబర్ లో వస్తుంది. ఆ తరువాత వెంటనే దీపావళి ఉంటుంది. ఈ రెండూ కీలకమైన పండుగలు, దాంతో ఈ పండుగలు ముగిసిన తరువాత నవంబర్ లో లోకల్ బాడీఎస్ కి ఎన్నికలకు తెర తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికి వాతావరణంతో పాటు అన్నీ అనుకూలిస్తాయని భావిస్తున్నారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్లు కూడా పూర్తిగా కొలిక్కి వస్తుందని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే లోకల్ బాడీ ఎన్నికలకు టీడీపీ కూటమి పూర్తి స్థాయిలో రెడీ అవడమే కాదు మొత్తానికి మొత్తం సీట్లు కైవశం చేసుకోవాలని చూస్తోంది.
వైసీపీ సంగతేంటి :
ఇక 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తం సీట్లను లోకల్ బాడీస్ లో స్వీప్ చేసిన వైసీపీ ఈసారి ఏమి చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. ఓటమి తరువాత రెండేళ్ళు గడచినా వైసీపీ ఇప్పటికి అయితే పూర్తి స్థాయిలో పుంజుకోలేదని అంటున్నారు. నాయకులు క్యాడర్ మధ్య గ్యాప్ అలాగే ఉంది. ఇక ఇంచార్జిలు నియోజకవర్గాలలో గట్టిగా రియాక్ట్ కావడం లేదని అంటున్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు ఇస్తే స్పందిస్తున్నారు. అది కూడా చాలా చోట్ల మొక్కుబడిగానే అంటున్నారు. ఇక లోకల్ బాడీస్ విషయం తీసుకుంటే అధికారంలో ఉన్న పార్టీకే విజయాలు ఉంటాయని భావించే ముందుగానే తెల్ల జెండా చూపిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. దాంతో కూటమి ఎంతో సీరియస్ గా లోకల్ బాడీ వార్ విషయంలో ఉంటే వైసీపీలో ఆ యుద్ధ స్పూర్తి కనిపించడం లేదని అంటున్నారు. మరి కూటమి చెప్పినట్లుగా మొత్తానికి మొత్తం సీట్లు కైవశం చేసుకుంటుందా దానిని అడ్డుకుని వైసీపీ తన ఉనికిని కాపాడుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.