మనసు అక్కడ...వైసీపీ ఇంచార్జి ఇక్కడ !
ఇక పాయకరావు పేట ఎస్సీ నియోజకవరమే కానీ అక్కడ గెలుపు గుర్రాలు గా ఎవరు ఉండాలన్నా బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు నిర్ణయమే కీలకం.
ఆయన మనసు పూర్తిగా తాను రెండు సార్లు వరసగా గెలిచిన చోట ఉంది. అయితే అధినాయకత్వం మాత్రం ఊహించని విధంగా ఆయనను మూడు జిల్లాలు దాటించి బదిలీ చేసింది. ఎన్నికలు ముంగిటిలో ఉండగా సడెన్ గా వచ్చి అనకాపల్లి జిల్లాకు చివరన ఉన్న పాయకరావుపేటలో పోటీకి సిద్ధమయ్యారు. తీరా చూస్తే ఫలితం తేడా కొట్టింది. ఓడి రెండేళ్ళు అయినా ఆయనే అక్కడ వైసీపీ ఇంచార్జి. ఆయనే కంబాల జోగులు. మాజీ ఎమ్మెల్యే. రాజాం నుంచి 2014, 2019లలో రెండు సార్లు గెలిచిన జోగులుని వైసీపీ 2024లో చేసిన ట్రాన్సఫర్స్ ప్రయోగంలో భాగంగా జిల్లాలు దాటించి మరీ పేటకు వెళ్ళమంది. సరేనంటూ వచ్చిన జోగులుకి చేదు అనుభవం ఎదురైంది.
సహకరించని క్యాడర్ తో :
ఇక పాయకరావు పేట ఎస్సీ నియోజకవరమే కానీ అక్కడ గెలుపు గుర్రాలు గా ఎవరు ఉండాలన్నా బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు నిర్ణయమే కీలకం. మొత్తం నాలుగు మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో కాపుల బలం ఎక్కువ. ఆ తరువాత మత్స్యకారులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు. అలాగే ఎస్సీలు కూడా గణనీయంగా ఉన్నారు. ఇక వైసీపీలో చూస్తే వర్గ పోరు పీక్స్ లో ఉన్న సీటు ఇది. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుది ఒక వర్గం అయితే ఆయన పొడ గిట్టని ప్రత్యర్ధులది వేరే వర్గం. ఇక తటష్తంగా ఉన్న వారు మరో వర్గం. కంబాల జోగులు అయితే ఏకంగా జిల్లాకే కొత్త. దాంతో ఏ వర్గమూ ఆయనకు మద్దతుగా నిలవడం లేదని అంటున్నారు. దాంతో పాటు ఆయన కూడా కో ఆర్డినేషన్ చేసుకోవడంలో విఫలం అవుతున్నారని అంటున్నారు.
రాజాం నుంచే అంటూ :
ఇక కంబల జోగులు రాజాం నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే అక్కడ 2024 ఎన్నికల్లో ఒక డాక్టర్ ని వైసీపీ కొత్తగా తెచ్చి బరిలో నిలిపింది. ఆయన ఓటమి పాలు అయ్యారు కానీ గత రెండేళ్ళుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఇక 2024లో జోగులుకి టికెట్ ఇస్తే ఓటమి పాలు అవుతామని భావించే వైసీపీ ఆయనను ట్రాన్సఫర్ చేసింది. అయితే ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఉంటే భావ్యం కాదని పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావుకు రాజ్యసభ సీటు ఇచ్చింది. అలా లైన్ క్లియర్ చేసి మరీ జోగులుని అక్కడికి పంపించింది. ఇక జోగులుకి పాయకరావు పేట వద్దు అంటే రాజాం లో మళ్ళీ టికెట్ ఇచ్చేది లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే 2029లో డాక్టర్ గారికే టికెట్ ఇస్తారు అని వైసీపీలో వినిపిస్తున్న మాట.
ఊగిసలాటలోనే అంతా :
పాపం కంబాల జోగులు రాజకీయం చూస్తే ఊగిసలాటలోనే ఉందని అంటున్నారు. పాయకరావుపేటలో క్యాడర్ అంతా కొత్త నాయకత్వం కావాలని కోరుతున్నారు. అది కూడా స్థానికులకే చాన్స్ ఇవ్వాలని అంటున్నారు. అపుడే టీడీపీకి ఎంతో బలం ఉన్న పాయకరావుపేటను గెలుచుకోగలమని చెబుతున్నారు. ఇక బాబూరావు విషయం తీసుకుంటే ఆయన తన వారసులకు టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన అంటే గిట్టని ప్రత్యర్ధి వర్గం తమ వైపు నుంచే ఇంచార్జి ఉండాలని పట్టుబడుతోంది. ఇలా పేటలో వైసీపీ వర్గ పోరు పీక్స్ కి చేరుకుంది. అదే సమయంలో ఇంచార్జిగా ఉన్న కంబాల జోగులు మనసు అక్కడ లేదని అంటున్నారు. మొత్తానికి పాయకరావుపేట జాతకం జోగులు రాజకీయం ఎప్పటికి ఏ విధంగా తేలేను అన్నది అతి పెద్ద ప్రశ్నగా మారింది.