సిక్కోలు టీడీపీలో కొత్త వారసత్వం ?
ఆ తరువాత ఆయనకు ఎన్ టీఆర్ హయాంలోనే మంత్రి పదవి కూడా దక్కింది.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎంతటి బలమైన పార్టీ అన్నది అందరికీ తెలిసిందే. 1983లో పార్టీ పెడితే అప్పట్లో జిల్లాలో ఉన్న మొత్తం సీట్లు అన్నీ టీడీపీ పరం అయ్యాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు వివిధ సామాజిక వర్గం నేతలు ముఖ్యంగా రాజ్యాధికారం అందుకోలేని బీసీలు అంతా టీడీపీలో చేరి ఎన్టీఆర్ చలవతో అధికారం అందుకున్నారు. అలా వచ్చిన వారే శ్రీకాకుళం పట్టణానికి చెందిన గుండ అప్పల సూర్యనారాయణ. న్యాయ వాదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్న గుండకు టీడీపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు ఎన్టీఆర్. ఆ తరువాత ఆయనకు ఎన్ టీఆర్ హయాంలోనే మంత్రి పదవి కూడా దక్కింది. మొత్తం నాలుగు సార్లు గుండ అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం అసెంబ్లీ సీటు నుంచి గెలిచి ఆ సీటుని టీడీపీకి కంచు కోటగా మార్చేశారు.
సతీమణి సైతం :
అంతే కాదు గుండ సతీమణి లక్ష్మీదేవి కూడా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. అయితే ఆమె 2019లో ఓటమి పాలు అయ్యారు. 2024లో ఆ కుటుంబానికి వివిధ రాజకీయ కారణాల రిత్యా టికెట్ దక్కలేదు. ఎల్సీ ఇస్తామని టీడీపీ అధినాయకత్వం గుండకు స్వయంగా హామీ ఇచ్చిందని ప్రచారం సాగింది. మొత్తానికి అయితే గుండ కుటుంబం టీడీపీని తాము వీడిపోమని పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి మరీ కష్టపడి పనిచేసింది, పార్టీని గెలిపించింది. టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత గుండా మరణించారు దాంతో శ్రీకాకుళంలో గుండ అనుచర వర్గం అయోమయంలో పడింది.
విగ్రహ స్థాపన తోనే మళ్ళీ :
ఇక శ్రీకాకుళం పట్టణంలో గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని రెండు చోట్ల ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులు నిర్ణయించారు. ఏపీలో ఉన్నది తమ ప్రభుత్వమే కాబట్టి సులువుగా అనుమతులు లభిస్తాయని కూడా భావించారు. కానీ జరిగింది వేరు, విగ్రహ స్థాపనకు కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకోవడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది దాని మీద పెద్ద ఎత్తున గుండ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అనుమతులు ఎట్టకేలకు ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి విగ్రహాల స్థాపన అన్నది తొందరలో జరగనుంది. అయితే విషయం అక్కడితో ఆగిపోవడం లేదు, గుండ తరఫున ఆయన వారసులు రావాలని ఆయన అనుచరులు అభిమానుల నుంచి ఒత్తిడి ఇపుడు అధికం అవుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి :
గుండ అప్పల సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు రాజకీయాలకు దూరంగా విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని చెబుతున్నారు. అందరి రాజకీయ వారసుల మాదిరిగా తన కుమారులను గుండ రాజకీయాల్లోకి దించలేదని అంటారు అయితే ఇపుడు గుండ అనుచరులు తమకు గుండ కుటుంబం నుంచి రాజకీయ వారసత్వం నాయకత్వం అండగా ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. గుండ విగ్రహానికే సొంత పార్టీలోని ప్రత్యర్ధులు ఇబ్బంది పెడుతున్నారని అందువల్ల ఆయన వారసులు రంగంలోకి దిగాల్సిందే అని అంటున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి గుండ ఫ్యామిలీ నుంచి కుమారులలో ఒకరు రంగంలోకి దిగుతారు అని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గోండు శంకర్ ఉన్నారు. ఆయనకు కింజరాపు ఫ్యామిలీ మద్దతు దండిగా ఉంది. మరి గుండ కుటుంబ సభ్యులు ఎవరైనా రేపటి రోజున రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఎవరికి టికెట్ దక్కుతుంది అన్నది అయితే చర్చగా ఉంది. మొత్తానికి గుండ విగ్రహం విషయంలో ఎదురైన ఆటంకాల నేపధ్యంలో గుండ ఫ్యామిలీ నుంచి కొత్త నాయకత్వం కోసం డిమాండ్ పెరుగుతోంది.