పాక్ రావణకాష్టం : సర్దార్ పటేల్ మాట వింటే పహల్గాం దాడి జరిగేదే కాదు

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఒక యుద్ధ వ్యూహంగా పరిగణిస్తోందని, దీనిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.;

Update: 2025-05-27 19:30 GMT

దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలను ఆనాటి పాలకులు పెడచెవిన పెట్టడం వల్లే దేశంలో ఉగ్రవాద దాడుల పరంపర కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, భారత్‌లో అలజడి సృష్టించాలని చూస్తున్న పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

పాక్ యుద్ధ వ్యూహాన్ని తిప్పికొడతాం:

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఒక యుద్ధ వ్యూహంగా పరిగణిస్తోందని, దీనిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారులు హాజరై, ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడం, ఆ దేశ సైన్యం వారికి సెల్యూట్ చేయడం వంటి చర్యలు ఉగ్రవాదం పట్ల పాక్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఇది పరోక్ష యుద్ధం కాదని, పాకిస్థాన్ యుద్ధ వ్యూహమని రుజువు చేస్తోందన్నారు. "మేము శాంతిని కోరుకుంటాం, ఇతరులు కూడా శాంతంగా ఉండాలని ఆశిస్తాం. కానీ, పరోక్ష యుద్ధంతో మా బలాన్ని పరీక్షిస్తే సహించేది లేదు" అని మోదీ హెచ్చరించారు.

1947 నాటి చారిత్రక తప్పిదం:

1947 నాటి భారత విభజన, కశ్మీర్ సమస్య గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, "1947లో దేశ విభజన జరిగిన రాత్రే కశ్మీర్‌లో తొలి ఉగ్రదాడి జరిగింది. సాయుధ ముఠాల సాయంతో కశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. ఆనాడు ఉగ్రవాదులను ఏరివేసి, ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహాను అప్పటి ప్రభుత్వ పెద్దలు వినలేదు. దాని ఫలితంగానే నేటికీ పర్యాటకులు, యాత్రికులు, పౌరులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. పహల్గాంలో జరిగిన దాడి కూడా ఇందుకు ఉదాహరణ" అని అన్నారు.

"ఆపరేషన్ సిందూర్‌"తో చావు దెబ్బ:

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ "ఆపరేషన్ సిందూర్‌"తో చావుదెబ్బ కొట్టిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో, భారత సైన్యం చూపిన ధైర్యసాహసాలకు గుర్తుగా సాంబా సెక్టార్‌లోని ఓ పోస్టుకు "సిందూర్‌" అని పేరు పెట్టాలని భారత సరిహద్దు భద్రతా దళం (BSF) ప్రతిపాదించింది. మే 10న సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో అమరులైన మరో ఇద్దరు జవాన్ల పేర్లను కూడా పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.

BSF అధికారుల ప్రకటన, అప్రమత్తత:

మే 10న పాకిస్థాన్ జరిపిన డ్రోన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనే క్రమంలో BSF సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ కుమార్ ప్రాణాలు కోల్పోయారని BSF ఐజీ జమ్మూ ఫ్రాంటియర్ శశాంక్ ఆనంద్ తెలిపారు. వారి పేర్లను కూడా సరిహద్దు పోస్టుకు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. "ఆపరేషన్ సిందూర్‌" సమయంలో BSF మహిళా సిబ్బంది, ముఖ్యంగా అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలోని బృందం చూపిన తెగువను ఆయన ప్రశంసించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ వెంబడి ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News