పాక్ ఫ్యూచర్ చెబుతోన్న మోడీ... ఎయిర్ బేస్ లో సంచలన వ్యాఖ్యలు!
ప్రధాని మోడీ పంజాబ్ లోని ఆదంపుర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడారు.;
ఆపరేషన్ సిందూర్ అనంతరం సోమవారం రాత్రి తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. పాకిస్థాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ.. వారి ప్రతిభ, సమన్వయం, సంయమనాలను కొనియాడారు. ఈ క్రమంలో తాజాగా పంజాబ్ లోని ఎస్-400 ఉన్న ఎయిర్ బేస్ ని సందర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ప్రధాని మోడీ పంజాబ్ లోని ఆదంపుర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ ను నిర్వహించాయని.. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్ మే 9, 10 తేదీల్లో దాడులకు యత్నించిందని.. అయితే మన సైన్యం వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు.
ఇదే సమయంలో... ఉగ్రవాదులకే కాకుండా వారికి మద్దతు ఇచ్చే పాకిస్థాన్ సైన్యానికి కూడా గట్టి సమాధానం ఇవ్వడం ద్వారా భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని అన్నారు. ఈ సందర్భంగా భారత సాయుధ దళాలను మరింత ప్రశంసిస్తూ... పాకిస్థాన్ లో ఉగ్రవాదులు ప్రశాంతంగా కూర్చుని, ఊపిరి పీల్చుకునే స్థలం లేదని మన సైన్యం చూపించిందని తెలిపారు.
ఇదే క్రమంలో.. సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశ దూకుడు విధానాన్ని పునరుద్ఘాటించిన ప్రధాని... మన అక్కా, చెల్లెల్ల సిందూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశామని.. మన సైన్యం కొట్టిన దెబ్బకు శత్రుస్థావరాలు మట్టిలో కలిసిపోయాయని ప్రధాని స్పష్టం చేశారు. మన ఆధునిక సైనిక సామర్థ్యం గురించి ఆలోచిస్తేనే పాక్ కు నిద్రపట్టదని అన్నారు.
అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని... ఈ ఉదయం ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ మన పోరాటయోధులను కలిశానని.. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచేవారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవమని.. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతిచర్యకు ప్రజలంతా ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు పంచుకున్నారు.