ట్రకోమా రహిత దేశంగా భారతదేశం.. సగర్వంగా చెప్పిన మోదీ

భారతదేశం ట్రకోమా రహిత దేశంగా మారడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారత్‌ను ట్రకోమా రహిత దేశంగా ప్రకటించిందని, ఇది దేశానికి గర్వకారణమని ఆయన తన 123వ "మన్ కీ బాత్" కార్యక్రమంలో పేర్కొన్నారు.;

Update: 2025-06-30 00:30 GMT

భారతదేశం ట్రకోమా రహిత దేశంగా మారడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారత్‌ను ట్రకోమా రహిత దేశంగా ప్రకటించిందని, ఇది దేశానికి గర్వకారణమని ఆయన తన 123వ "మన్ కీ బాత్" కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

మిల్లెట్‌ మ్యాజిక్‌తో లండన్‌కు భద్రాద్రి మహిళల ప్రయాణం

ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలంగాణలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళల స్ఫూర్తిదాయక కృషిని ప్రస్తావించారు. ఈ మహిళలు "భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్" పేరుతో మిల్లెట్ బిస్కెట్లు తయారుచేస్తూ, వాటిని లండన్‌కు ఎగుమతి చేయడం దేశానికే గర్వకారణమని అన్నారు. అంతేకాకుండా ఈ మహిళలు కేవలం మూడు నెలల్లోనే 40,000 శానిటరీ నాప్‌కిన్లు తయారుచేసి విక్రయించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఇది గ్రామీణ మహిళల సాధికారతకు, ఆత్మనిర్భరతకు నిదర్శనమని ప్రధాని ప్రశంసించారు.

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత విజయాలు

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఘనంగా నిర్వహించారని ప్రధాని తెలిపారు. యోగా రోజురోజుకు ప్రజల జీవితాల్లో భాగం అవుతుండటం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తుచేసుకుంటూ అప్పటి రాజ్యాంగ హనన ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. "న్యాయవ్యవస్థను బానిసగా మార్చాలని చూసిన వారు చివరికి ఓడిపోయారు. భారత ప్రజల శక్తి కారణంగా దేశం తిరిగి ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చింది," అని మోదీ అన్నారు. జార్జ్ ఫెర్నాండెజ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, బాబూ జగ్జీవన్ రామ్ వంటి నాయకుల మాటలను ఆయన ప్రస్తావించారు.

క్రీడలు, సంస్కృతి, ఆరోగ్యంపై దృష్టి

బోడోల్యాండ్ ప్రాంతం ఫుట్‌బాల్ ఆటలో కేంద్రంగా మారడం పట్ల ప్రధాని ప్రశంసలు కురిపించారు. పరిమిత వనరులతోనే అద్భుతంగా రాణిస్తున్న అక్కడి క్రీడాకారులు దేశంలోని చిన్నారులకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. మేఘాలయలో తయారయ్యే ఎరీసిల్క్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ లభించడం గొప్ప గౌరవమని ప్రధాని మోదీ అభినందించారు. పురుగులను చంపకుండానే ఈ వస్త్రాన్ని తయారుచేయడం దీని ప్రత్యేకత అని ఆయన వివరించారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఇది ఊబకాయం మరియు ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అద్భుతంగా రాణిస్తున్న శుభాంశు శుక్లాను ప్రధాని అభినందించారు. ఇది దేశ యువతకు ప్రేరణనిచ్చే విషయమని ఆయన పేర్కొన్నారు.

మొత్తంగా ప్రధాని మోదీ ప్రసంగం దేశ అభివృద్ధి, ప్రజల చైతన్యం, సాంస్కృతిక వారసత్వంపై దృష్టి సారించింది. సామాన్యుల కృషిని గుర్తించి వారికి దేశమంతటా ప్రోత్సాహాన్ని కల్పించడం ఈ ప్రసంగానికి ప్రధాన హైలైట్‌గా నిలిచింది. దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని ప్రధాని మరోసారి గుర్తుచేశారు.

Tags:    

Similar News