ఇందిరను వెనక్కి నెట్టేసిన ప్రధాని మోదీ.. ఇక మిగిలింది తొలి పీఎం నెహ్రూ మాత్రమే?

ప్రధాని మోదీ ఈ సారి ఆగస్టు 15 సందర్భంగా అనేక రికార్డులు నమోదు చేశారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం సాధించడంతో వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.;

Update: 2025-08-16 10:33 GMT

ప్రధాని మోదీ ఈ సారి ఆగస్టు 15 సందర్భంగా అనేక రికార్డులు నమోదు చేశారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం సాధించడంతో వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక శుక్రవారం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలతో ఇప్పటివరకు 12 సార్లు ఎర్రకోటపై జెండా ఎగరేసిన నేతగా ప్రధాని మోదీ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈ సారి అనేక విషయాల్లో మోదీ తనకు ఎవరూ సాటిలేరని నిరూపించుకున్నారని జాతీయ మీడియా ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. దీంతో ప్రధాని మోదీ ప్రస్థానంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇది మోదీ రికార్డు

79వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో ప్రధాని మోదీ రికార్డులపై ప్రత్యేక కథనాలు ప్రచారమవుతున్నాయి. ఎర్రకోటపై నుంచి 103 నిమిషాల పాటు అనర్గళంగా ప్రసగించిన తొలి ప్రధానిగా మోదీ ఓ రికార్డు స్థాపించారని చెబుతున్నారు. ఒక ప్రధాని ఇంత సుదీర్ఘ పంద్రాగస్టు ప్రసంగం చేయడం ఇప్పటివరకు లేదని, స్వతంత్ర భారత చరిత్రలోనే ఇది తొలిసారిగా జాతీయ మీడియా చెబుతోంది. గత ఏడాది 98 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని తన రికార్డును తానే అధిగమించారు. నిజానికి గత ఏడాది 98 నిమిషాల పాటు ఆయన మాట్లాడం ఓ రికార్డుగా చెబుతున్నారు. దాన్ని ఈ ఏడాది ప్రధాని మోదీ అధిగమించడం ఇంకా విశేషం అంటున్నారు.

ఎర్రకోట ప్రసంగాలు

ప్రధాని మోదీకన్నా ముందు దీర్ఘ ప్రసంగం చేసిన నేతగా తొలి ప్రధాని నెహ్రూ పేరిట ఇన్నాళ్లు రికార్డు ఉంది. పంద్రాగస్టు సంబరాల్లో ప్రధానిగా నెహ్రూ ఒకసారి 72 నిమిషాలు ప్రసంగించారని జాతీయ మీడియా రిపోర్టు చేస్తోంది. నెహ్రూ తర్వాత 71 నిమిషాలపాటు ఎర్ర కోట నుంచి ప్రసంగించి ఐకే గుజ్రాల్ రెండో స్థానంలో ఉండేవారు. గత ఏడాది వరకు నెహ్రూ, గుజ్రాల్ మాత్రమే అతి దీర్ఘ ప్రసంగికులుగా భావించేవారు. అయితే గత ఏడాది ఆ రికార్డును చెరిపేసి తొలిస్థానంలోకి వెళ్లిన ప్రధాని మోదీ.. ఈ ఏడాది అంతకుమించి మరో రికార్డు నమోదు చేశారు. ఇదే సమయంలో ఎర్రకోటపై నుంచి అత్యల్ప సమయం మాట్లాడిన నేతలుగా నెహ్రూ, ఇందిర పేర్లను చెబుతున్నారు. 1954లో నెహ్రూ, 1966లో ఇందిరా గాంధీ కేవలం 14 నిమిషాల్లోనే తమ ప్రసంగాలను ముగించారని రికార్డులు చెబుతున్నాయి.

ఇందిరను వెనక్కి నెట్టి..

ఇక వరుసగా మూడోసారిగా ప్రధానిగా కొనసాగుతున్న ప్రధాని మోదీ వరుసగా 12 సార్లు ఎర్రకోట నుంచి దేశానికి సందేశం ఇచ్చిన నేతగా దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును మోదీ ఈ సారి అధిగమించారు. ఇందిరాగాంధీ 1966 జనవరిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1977 వరకు కొనసాగారు. అనంతరం 1980లో మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిర 1984లో మరణించేవరకు ప్రధానిగా కొనసాగారు. ఈ క్రమంలో ఇందిర మొత్తం 16 సార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధానిగా రికార్డు స్థాపించారు. అయితే వరుసగా ఆటంకం లేకుండా ఎక్కువ సార్లు ప్రసంగించిన ప్రధానిగా మోదీదే ఇప్పటివరకు రికార్డు అంటున్నారు.

ఇప్పటికి నెహ్రూ రికార్డు

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఇప్పటికీ ఆల్ టైం రికార్డు ఉంది. వరుసగా మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ మిగిలిన నేతలు నెలకొల్పిన నేతల రికార్డులను అధిగమించే అవకాశం ఉన్నా, మాజీ ప్రధాని నెహ్రూ స్థాపించిన ఒక రికార్డును మాత్రం ఈ టర్మ్ లో అధిగమించే పరిస్థితి లేదంటున్నారు. ఎర్ర కోట నుంచి జెండా ఎగురవేసిన ప్రధానుల్లో నెహ్రూ పేరిట అత్యధిక రికార్డు ఉంది. దేశ తొలి ప్రధాని అయిన నెహ్రూ మొత్తం 17 సార్లు జెండా ఆవిష్కరించారు. ఇక ఆయన తర్వాత ఇందిర 16 సార్లు రికార్డు ఉంది. అయితే ప్రస్తుతం మూడో టర్మ్ ప్రధానిగా కొనసాగుతున్న మోదీ 12 సార్లు ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. మరో మూడేళ్లు ఆయనే జెండా వందనం చేసే అవకాశం ఉన్నప్పటికీ నెహ్రూ రికార్డును ఈ టర్మ్ లో అధిగమించే అవకాశం లేదని అంటున్నారు. ఇక మన్మోహన్ సింగ్ పదిసార్లు ఏబీ వాజపేయి ఆరుసార్లు, రాజీవ్ గాంధీ ఐదుసార్లు, పీవీ నాలుగుసార్లు, వీపీ సింగ్, దేవేగౌడ, గుజ్రాల్ ఒక్కొసారి జెండా వందనం చేశారని రికార్డులు చెబుతున్నాయి.

Tags:    

Similar News