ప‌ర్యావ‌ర‌ణ‌ కల్లోలానికి పరిష్కారం: యూజ్డ్ ప్లాస్టిక్‌ నుండి సరికొత్త ప్లాస్టిక్ తయారీ!

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రస్తుతం తలకుమించిన భారంగా మారింది. ముఖ్యంగా మహాసముద్రాలలో విపరీతంగా పోగుపడుతున్న ప్లాస్టిక్ చెత్త, సముద్ర జీవరాశుల పర్యావరణ వ్యవస్థను (ఎకోసిస్టమ్‌ను) దారుణంగా నాశనం చేస్తోంది.

Update: 2026-06-20 03:00 GMT

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రస్తుతం తలకుమించిన భారంగా మారింది. ముఖ్యంగా మహాసముద్రాలలో విపరీతంగా పోగుపడుతున్న ప్లాస్టిక్ చెత్త, సముద్ర జీవరాశుల పర్యావరణ వ్యవస్థను (ఎకోసిస్టమ్‌ను) దారుణంగా నాశనం చేస్తోంది. దీనివల్ల మానవాళి ప్రకృతి ప్రకోపాలను, పర్యావరణ విపత్తులను ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఇంతకాలం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి.. దానిని తిరిగి నాణ్యమైన సరికొత్త ప్లాస్టిక్ ఉత్పత్తిగా మార్చే సరైన వెసులుబాటు అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వేస్టేజ్ నుండి సరికొత్త ప్లాస్టిక్ తయారీ మంత్రాంగం ఫలించిందనే శుభవార్త పర్యావరణ ప్రేమికులకు గొప్ప ఊరటనిస్తోంది. భవిష్యత్తులో ప్లాస్టిక్ కల్లోలాన్ని తగ్గించేందుకు ఇది ఒక కొత్త మార్గాన్ని చూపబోతోంది.

నెదర్లాండ్స్‌లోని `యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డామ్` పరిశోధకులు ఈ విప్లవాత్మక సాంకేతికతను అభివృద్ధి చేశారు. `సాల్వోథర్మల్ లిక్విఫాక్షన్` అని పిలిచే ఈ ప్రక్రియ ద్వారా కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే... 25 లీటర్ల పైలట్ రియాక్టర్ సహాయంతో మిశ్రమ ప్లాస్టిక్ వ్యర్థాలను మరిగించి నూనెగా మార్చవచ్చు. ఈ ప్రాజెక్ట్ అతిపెద్ద విజయం ఏమిటంటే.. ప్లాస్టిక్ వ్యర్థాలను రకాల వారీగా విడదీయాల్సిన అవసరం లేదు. సాధారణంగా రీసైక్లింగ్ ప్రక్రియలో కార్మికులు లేదా ఆప్టికల్ సెన్సార్ల ద్వారా పాలిథిలిన్.. పాలీప్రొఫిలీన్ వంటి ర‌క‌రకాల ప్లాస్టిక్‌లను వేరు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సరికొత్త విధానంలో ఎలాంటి విభజన లేకుండానే మిశ్రమ ప్లాస్టిక్‌ను నేరుగా రియాక్టర్‌లోకి పంపి ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ఈ పరికరంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై ద్రావకాలు (సాల్వెంట్స్), అధిక ఉష్ణోగ్రత - అధిక పీడనాన్ని ప్రయోగిస్తారు. ఇందుకోసం పరిశోధక బృందం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన `సాలిడ్ నానోస్ట్రక్చర్డ్ క్యాటలిస్టులను` (ఉత్ప్రేరకాలను) ఉపయోగిస్తారు. ఇవి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేవలం 30 నిమిషాల్లోనే ప్లాస్టిక్ మాలిక్యులర్ బంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా కేవలం ఒకే ఉత్పత్తి కాకుండా మూడు రకాల ఉప-ఉత్పత్తులు వస్తాయి. మొదటిది గ్యాస్... దీనిని ఈ సిస్టమ్‌ను రన్ చేయడానికి ఇంధనంగా వాడుకుంటారు. రెండవది చార్‌కోల్ (బొగ్గు). ఇక మూడవది ముదురు గోధుమ రంగులో ఉండే నూనె. ఈ నూనెలోనే అసలైన సాంకేతిక విలువ దాగి ఉంది. దీని నుండి తయారుచేసే ప్లాస్టిక్... శిలాజ ఇంధనాలతో తయారుచేసే ప్లాస్టిక్ వలెనే అత్యంత నాణ్యమైనదిగా ఉంటుంది.

అయితే ప్రయోగశాలల్లో కనుగొనే ఆవిష్కరణలను వాస్తవ ప్రపంచంలోకి, పారిశ్రామిక స్థాయికి తీసుకురావడం చాలా కష్టతరమైన పని. ప‌లుమార్లు అకడమిక్ ఆవిష్కరణలు ల్యాబ్‌లకే పరిమితమై ఫెయిలైపోతుంటాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి ఈ ప్రాజెక్ట్‌కు యూరోపియన్ ప్రాజెక్ట్ `ప్లాస్టిస్` పరిధిలో భారీగా నిధులు సమకూరాయి. ఆమ్‌స్టర్‌డామ్ పరిశోధకులు భారతదేశానికి చెందిన ఒక ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కంపెనీతో చేతులు కలిపి.. సులభంగా రవాణా చేయగల .. సురక్షితమైన మొబైల్ ప్లాంట్‌ను స్టీల్ నిర్మాణాలపై రూపొందించారు. ఇంజనీరింగ్ పరిభాషలో ఈ సాంకేతికత ప్రస్తుతం `టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ 6/7` మైలురాయిని అందుకుని.. ప్రాక్టిక‌ల్ గా అందుబాటులోకి రావ‌డానికి సిద్ధంగా ఉంది.

ల్యాబ్ పరిధి దాటిన ఈ సరికొత్త సాంకేతికతకు సంబంధించిన అత్యంత కీలకమైన..క‌చ్చితమైన పరీక్ష ఈ వేసవిలో స్పెయిన్ దేశంలో ప్రారంభం కానుంది. స్పెయిన్ ఉత్తర భాగంలోని ప్రభుత్వ వ్యర్థాల నిర్వహణ సంస్థ COGERSA ఈ మొబైల్ ప్లాంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రయోగశాలలోని నియంత్రిత వాతావరణానికి... వాస్తవ ప్రపంచంలోని గృహ వ్యర్థాల గందరగోళానికి చాలా తేడా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్పెయిన్‌లోని వాస్తవ మునిసిపల్ వ్యర్థాల సవాల్‌ను ఈ పైలట్ రియాక్టర్ విజయవంతంగా తట్టుకుంటే... ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ సమస్యను శాశ్వతంగా నిర్మూలించే వికేంద్రీకృత రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ప్లాస్టిక్‌ను ల్యాండ్‌ఫిల్‌లలో పడేయడం లేదా తగులబెట్టడానికి బదులు.... దానిని మళ్లీ కొత్త ప్లాస్టిక్‌గా మార్చే నిజమైన క్లోజ్డ్-లూప్ సైకిల్ సాధ్యమవుతుంది.

Tags:    

Similar News