చమురు షాక్.. ఎన్నికల తర్వాత లీటరుకు ₹28 పెంపు..? కోటక్ ఈక్విటీస్ సంచలన హెచ్చరిక!
దేశంలో ఎన్నికల కాలంలో ధరలు స్థిరంగా ఉండడం, ఎన్నికలు ముగియగానే ఆకాశాన్ని తాకడం తరచూ చూస్తూనే ఉంటాం.;
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే సామాన్యుడి జేబుకు పెద్ద చిల్లు పడుతుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్’ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా ₹25 నుంచి ₹28 వరకు పెరిగే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
దేశంలో ఎన్నికల కాలంలో ధరలు స్థిరంగా ఉండడం, ఎన్నికలు ముగియగానే ఆకాశాన్ని తాకడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి పెరగబోయే ధరలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉండబోతున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $120 మార్కును తాకాయి. ఈ భారాన్ని భరించలేక భారత చమురు కంపెనీలు ధరల పెంపునకు సిద్ధం అవుతున్నాయి.
ఎందుకు ఇంత పెంపు?
కోటక్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం చమురు కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలు సామాన్యమైనవి కావు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచడం వల్ల చమురు కంపెనీలు ప్రతి నెలా సుమారు ₹27,000 కోట్ల భారాన్ని మోస్తున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చూస్తే, ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న పెట్రోల్ ధర కంటే వాస్తవ ధర ₹18 ఎక్కువగా ఉండాలి, డీజిల్ ధర ₹35 వరకు తక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నష్టాలను భరించడం ఇక చమురు కంపెనీల వల్ల కాదని, ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఈ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పదని కోటక్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు, పెరగబోయే అంచనా ధరల వివరాలు పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ప్రస్తుత ధర ₹107.46 ఉండగా, అది ₹135.46కి పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో డీజిల్ ప్రస్తుత ధర ₹95.70 నుంచి ₹123.70కి చేరవచ్చు. ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తుతం ₹94.77 ఉండగా, అంచనా ప్రకారం అది ₹122.77కి పెరగవచ్చు. ఇక ముంబైలో పెట్రోల్ ప్రస్తుత ధర ₹103.50 ఉండగా, అది ₹131.50కి పెరిగే అవకాశం ఉంది. అన్ని నగరాల్లోనూ లీటరుకు ₹28 వరకు పెరుగుదల ఉండవచ్చని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది.
సామాన్యుడిపై ప్రభావం..
చమురు ధరలు పెరిగితే అది కేవలం వాహనదారులకే కాదు, ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. లారీలు, వ్యాన్‌ల రవాణా చార్జీలు పెరగడం వల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ట్రాక్టర్లు, పంపు సెట్ల వాడకం భారమై రైతులపై భారం పడుతుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాకముందే మే మొదటి వారంలోనే ఈ పెంపు ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ అనిశ్చితి, కంపెనీల నష్టాలు చూస్తుంటే ఈసారి ధరల బాదుడు తప్పదని అర్థమవుతోంది. ఈ ‘చమురు మంట’ నుంచి సామాన్యుడిని కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.