జైల్లో కొడుకుని పరామర్శించిన పెద్దిరెడ్డి... చంద్రబాబు పై ఫైర్!

అవును... వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న తన కుమారుడు మిథున్ రెడ్డిని ఇవాళ వైసీపీ నేతలతో కలిసి పరామర్శించారు.;

Update: 2025-07-23 10:25 GMT

ఏపీ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టై, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. ఈ సమయంలో.. జైల్లో ఉన్న తన కుమారుడిని పరామర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

అవును... వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న తన కుమారుడు మిథున్ రెడ్డిని ఇవాళ వైసీపీ నేతలతో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... గత టీడీపీ హయాంలో భారీ లిక్కర్ స్కాం జరిగిందని, ఇవాళ కూటమి సర్కార్‌ లోనూ దానికి మించి మద్యం అవినీతి జరుగుతోందని పెద్దిరెడ్డి ఆరోపించారు.

ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌ గా మార్చిందని.. నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారని అన్నారు. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాంకు చంద్రబాబు ప్రభుత్వం తెరతీసిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.

ఈ క్రమంలో... ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసి, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిందని.. అయితే వైసీపీ హయంలో ఏపీలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను తీసుకుని, ప్రభుత్వమే వాటిని నిర్వహించిందని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏ డిస్టిలరీలకు కొత్తగా అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.

దీనికి పూర్తి విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ మాత్రం... ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లిక్కర్ దుకాణాలను తీసేసి, ప్రైవేటు వారికి అప్పగించారని.. మద్యం రేట్లు ఎమ్మార్పీని ఉల్లంఘంచి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని.. ఏపీలో మద్యం డోర్‌ డెలివరీ అవుతుందని.. ప్రతి గ్రామం, వార్డుల్లో బెల్ట్‌ షాప్‌ లు నడుస్తున్నాయని పెద్దిరెడ్డి విమర్శించారు.

వాస్తవానికి 2014-19 టీడీపీ పాలనలో ఆఖరి సంవత్సరంలో వచ్చిన ఏడాది మద్యం ఆదాయం కేవలం రూ.17వేల కోట్లు మాత్రమేనని చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో ఆఖరి ఏడాది వచ్చిన మద్యం ఆదాయం రూ.25 వేల కోట్లు అని తెలిపారు. పైగా మద్యం అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు.

ఇక... గతంలో మద్యాన్ని నియంత్రించేందుకు వైసీపీ ప్రభుత్వం పనిచేస్తే.. చంద్రబాబు మాత్రం మద్యాన్ని అడ్డు పెట్టుకుని తన అవినీతి దాహం తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించాడని అన్నారు. ఈ సందర్భంగా తనపై ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులకు భయపడేది లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News