పవన్ ‘సింహం’ పంచ్ అదిరిపోలా..
టీడీపీ, జనసేనల్ని రెచ్చగొట్టేలా పదే పదే జగన్ సింహం, సింగిల్‌గా వస్తాడు అంటూ ఎలివేషన్లు ఇచ్చుకునే వైసీపీ మద్దతుదారులకు జనసేనాని అదిరిపోయే పంచ్ వేశారు గురువారం.;
ప్రపంచంలో పొత్తులు పెట్టుకుని ఏ పార్టీలూ ఎన్నికల్లో పోటీ చేయనట్లు.. అదో పెద్ద పాపం అన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు.. తెలుగుదేశం, జనసేనల బంధం గురించి నానా మాటలు అంటుంటారు. స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నడిపించినపుడు వామపక్షాలతో, టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. ఈ విషయాన్ని మరిచిపోయి.. తెలుగుదేశం, జనసేన పార్టీలు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తుంటారు జగన్ అండ్ కో.
అంతే కాక జగన్ సింహం అని.. సింగిల్‌గానే వస్తాడని.. చంద్రబాబు, పవన్‌లకు దమ్ము లేదు కాబట్టే పొత్తు మీద ఆధారపడతాయని కామెంట్లు కూడా చేస్తుంటారు. ఐతే ఈ స్టేట్మెంట్ల వెనుక ఆంతర్యం అందరికీ తెలిసిందే. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది.. అప్పుడు వైసీపీ గెలుపు కష్టం అవుతుంది. అందుకే పొత్తుకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుంటారు.
టీడీపీ, జనసేనల్ని రెచ్చగొట్టేలా పదే పదే జగన్ సింహం, సింగిల్‌గా వస్తాడు అంటూ ఎలివేషన్లు ఇచ్చుకునే వైసీపీ మద్దతుదారులకు జనసేనాని అదిరిపోయే పంచ్ వేశారు గురువారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయంటూ ఎవ్వరూ ఊహించని ఈ సమయంలో సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్.
ఈ సందర్భంగా విలేకరులు సింహం-సింగిల్ డైలాగ్‌ను గుర్తు చేశారు. దానికి పవన్ స్పందిస్తూ.. ''వాళ్లు సింహాలే. సింగిల్‌గానే రమ్మనండి. మేం మనుషులం. కలిసి పోటీ చేస్తాం'' అంటూ పవన్ ఇచ్చిన స్టేట్మెంట్‌తో ప్రశ్న అడిగిన వాళ్లకు కూడా దిమ్మదిరిగిపోయే ఉంటుంది. చుట్టూ ఉన్న టీడీపీ, జనసేన నేతల నుంచి మంచి స్పందన వచ్చింది ఈ డైలాగ్‌తో.
సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ వాళ్లకు ఇంతకుమించిన పంచ్ ఉండదని.. ఇకనైనా ఈ సింహం-సింగిల్ ఎలివేషన్లు పక్కన పెట్టి టీడీపీ-జనసేనల్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు.