పవన్ ఆ ఒక్క డైలాగ్ తో ఆటాడుకుంటున్నారా ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఆవేశం పాలు ఎక్కువ. ఆయన మీడియా మీటింగ్స్ లో జాగ్రత్తగానే మాట్లాడుతారు;
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఆవేశం పాలు ఎక్కువ. ఆయన మీడియా మీటింగ్స్ లో జాగ్రత్తగానే మాట్లాడుతారు కానీ ఒక్కసారి బహిరంగ సభలలో వేదిక ఎక్కారంటే మాత్రం వీరావేశమే ప్రదర్శిస్తారు. కొన్ని సార్లు ఆ టైం లో ఆయన భారీ డైలాగులు కూడా వదులుతారు. అవి డైనమేట్లుగా పేలుతాయి. వాటి మీద చర్చ కూడా ఒక లెవెల్ లో సాగుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే విశాఖ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కేంద్రం అండతో జగన్ని ఒక ఆట ఆడిస్తాను అని భీకరమైన స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాన్ని పట్టుకుని వైసీపీ అయితే సెటైర్లే పేల్చుతోంది. మంత్రులు కూడా నీ పవర్ పలుకుబడి ఏంటో చూపించు పవన్ అని కవ్విస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా అయితే పవన్ని ఏపీ రాజకీయాల్లో ఆటలో అరటిపండుగా లైట్ తీసుకున్నారు.
కేంద్రం వద్ద పలుకుబడి అంటూ పవన్ చెప్పడాన్ని తప్పుపట్టారు. ఇక మరో మంత్రి గుడివాడ అమరానాధ్ అయితే పవన్ కి అంత పలుకుబడి ఉంటే కనుక కేంద్రంతో చెప్పి ప్రత్యేక హోదా విభజన హామీల గురించి మాట్లాడి వాటిని సాధిచాలని రివర్స్ అటాక్ చేశారు. ఇపుడు వామపక్షాల వంతు అయింది.
అసలే బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారని కామ్రేడ్స్ కి మంట. ఇపుడు కేంద్రం అండతో అని పవన్ అనడంతో సీపీఐ నేత రామక్రిష్ణ అయితే తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేంద్రం వద్ద పవన్ కి అంత పలుకుబడి ఉంటే జగన్ తో ఆటాడుకోవడం కాదు, ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయించాలని కూడా కోరారు.
అదే విధంగా జగన్ మీద విచారణ జరిపించాలని కూడా కోరారు. కేంద్రం అండదండలు లేకపోతే జగన్ ఏపీలో ఇంత దూకుడుగా వెళ్ళరన్న సంగతిని పవన్ తెలుసుకోవాలని అన్నారు. మొత్తానికి పవన్ తనకు కేంద్ర పెద్దల వద్ద చనువు సాన్నిహిత్యం ఉంది అని చెప్పుకుంటే అధికార వైసీపీయే కాదు విపక్షాలు సైతం పవన్ మీదనే తమ విమర్శల గురి పెడుతున్నారు.
కేంద్రం సైతం పవన్ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నా జగన్ విషయంలో ఏమీ చేయదు అని అంటున్నారు. రాజకీయాల్లో అనేక అంశాలు ఉంటాయి కాబట్టి కొన్ని పరిమితుల మేరకే ఎవరైనా పనిచేస్తారు అని అంటున్నారు. అయితే పవన్ నిజాయతీతో ఈ ప్రకటన చేసి ఉండవచ్చు కానీ ఆయన కోరుకున్నట్లుగా బీజేపీ జగన్ని ఒక ఆట ఆడించేందుకు ముందుకు వస్తుందా అన్నదే సందేహంగా ఉంది. దీంతోనే వైసీపీ నేతలు పవన్ సీరియస్ కామెంట్స్ ని కూడా లైట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు.