బంగ్లా - గంగ.. పాక్ - చంద్రముఖి... ఏమి జరుగుతుందంటే..!
గత కొన్ని రోజులుగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే.;
గత కొన్ని రోజులుగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక ప్రభుత్వ అలసత్వమో.. లేక, వ్యూహాత్మక ప్రోత్సాహమో తెలియదు కానీ.. ఆ దేశంలో అంతర్గత అశాంతి నెలకొంది.. ఉగ్రవాదులు మంత్రులు అయిపోయారు.. తీవ్రవాదులు ప్రజా జీవితంలో పాత్రలు పోషిస్తున్నారు.. పాలనలోనూ వారు పట్టు సంపాదించారు. ఈ నేపథ్యంలో.. గంగ చంద్రముఖిగా మారిపోతుంది అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్ తో సఖ్యతగా ఉంటూ, అభివృద్ధి దిశగా ప్రయత్నిస్తూ, అశాంతికి అవకాశం లేకుండా, ఉగ్రవాదుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ ఉన్న వేళ.. గత ఏడాది జూలైలో ఏర్పడిన తిరుగుబాటు తర్వాత హసీనా బంగ్లాను విడిని భారత్ వెళ్లిపోయారు. నాటి నుంచి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం.. బంగ్లాదేశ్ ను అన్ని విషయాల్లోనూ దాదాపు దశాబ్ధాల వెనక్కి తీసుకుపోతుందని అంటున్నారు.
ప్రధానంగా గత ఏడాది జూలైలో జరిగిన తిరుగుబాటులో కీలక భూమిక పోషించిన షరీఫ్ ఉస్మాన్ హైదీ కాల్చి చంపబడిన అనంతరం బంగ్లాదేశ్ మరింత రగిలిపోయింది. మీడియా సంస్థలపై దాడుల వరకూ వెళ్లింది.. భారత దౌత్య కార్యాలయాలకు బెదిరింపులు రావడం, ఆ ప్రాంతంలోని వీసా కేంద్రాలను భారత్ మూసివేయడం వరకూ పరిస్థితి మారిపోయింది. ఇది పూర్తిగా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చేతకానితనమే అనే చర్చ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. ఈ సందర్భంగా... మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇదులో భాగంగా... తనను బహిష్కరించినప్పటి నుంచీ బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దిగజారిందని.. నిరంతర హింస బంగ్లాదేశ్ ను అమతర్గతంగా అస్థిరపరుస్తోందని.. పొరుగు దేశాలతో, ప్రధానంగా భారత్ తో సంబంధాలను దెబ్బతీస్తోందని.. ఇది మంచిది కాదని తెలిపారు!
తాజాగా జరిగిన హైదీ హత్య.. యూనస్ పాలనలో పెరిగిపోయిన అక్రమాన్ని ప్రతిబింబిస్తుందని.. ఉగ్రవాదులను యూనస్ క్యాబినెట్ పదవుల్లో ఉంచాడని.. దోషులుగా నిర్ధారించబడిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేశాడని.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న సమూహాలను ప్రజా జీవితంలో పాత్రలను పోషించడానికి అనుమతించాడని ఆమె పేర్కొంది. సంక్లిష్టమైన దేశాని పరిపాలించడంలో అతనికి అనుభవం లేదని అన్నారు.
ఇదే సమయంలో.. ప్రధానంగా.. భారతదేశం - బంగ్లాదేశ్ సంబంధాలు మరింత దిగజారడంపై మాజీ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత వ్యతిరేక నిరసనలు, 25 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యను ఎత్తి చూపారు.. న్యూఢిల్లీకి వ్యతిరేకంగా శత్రు సందేశాలు పంపడం, మతపరమైన మైనారిటీలను రక్షించడంలో విఫలమైందంటూ తాత్కాలిక ప్రభుత్వాన్ని హసీనా బాధ్యురాలిగా అభ్హివర్ణించారు.
ఈ నేపథ్యంలోనే.. ప్రస్తుతం పరిస్థితులన్నింటినీ నిశితంగా పరిశీలిస్తుంటే... క్రమక్రమంగా పాకిస్థాన్ మాదిరిగా బంగ్లాదేశ్ మారిపోతుందనే చర్చ బలంగా వినిపిస్తుంది. పైగా.. వచ్చే ఏడాది ఆ దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ లోపు పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు.