టీడీపీ కూటమి ప్రభుత్వంలో పవన్ కీలక పాత్ర ?

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తారా అంటే ఈ రోజుకు అయితే అది ఎలా అన్న ప్రశ్నలే వస్తాయి.;

Update: 2024-04-16 03:58 GMT

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తారా అంటే ఈ రోజుకు అయితే అది ఎలా అన్న ప్రశ్నలే వస్తాయి. ఎందుకంటే టీడీపీ కూటమికి పెద్దన్న తెలుగుదేశం. ఆ పార్టీ 144 సీట్లలో పోటీ చేస్తోంది. జనాలు కూటమికి పట్టం కట్టాలనుకుంటే టీడీపీకి పూర్తి మెజారిటీ ఇస్తారు. 88 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ ని సాధించినట్లే. అలా టీడీపీకి సొంతంగా మెజారిటీ వస్తే అపుడు జనసేన కీలక పాత్ర పోషించేందుకు ఏమీ ఉండదు అని రాజకీయ పండితులు చెప్పేమాట.

పైగా జనసేన పోటీ చేసేది కేవలం 21 సీట్లలో. ఇందులో మొత్తానికి మొత్తం సీట్లు గెలిచినా కూడా కూటమిని కదిలించే అంత స్థాయిలో పాత్ర ఉంటుందా అంటే తలపండిన రాజకీయ నేతలు చెప్పేది లేదు అని. పైగా దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది బాబే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇక టీడీపీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు.

అదే విధంగా తెలుగుదేశం పాలనలో కూడా విశేష అనుభవం కలిగినది.దాంతో పాటు జనసేన అధినేత పవన్ చట్టసభలకు నెగ్గితే అదే తొలిసారి అవుతుంది. పాలన పట్ల అవగాహన కూడా పెంచుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు అవసరమైన మర్యాద ఇస్తారు అనే అంటున్నారు.

ఆయనకు మంత్రి పదవి ఇస్తారని జనసేన నుంచి మరో ఇద్దరు ముగ్గురుకి పదవులు దక్కుతాయని అంటున్నారు. అంతవరకూ ప్రాధ్యాన్యత ఉంటుంది తప్ప అంతకు మించి కీలక పాత్ర పోషించడం అన్నది జరిగే విషయం కాదని అంటున్నారు. అదే సందర్భంలో బీజేపీ నుంచి గెలిచిన వారిలో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇస్తారు అని అంటున్నారు. అలా మిత్రులకు నాలుగు మంత్రి పదవులు ఈసారి ఇవ్వవచ్చు అని అంటున్నారు. 2014 నుంచి 2018 దాకా బీజేపీ బాబు ప్రభుత్వంలో ఉండేది అందులో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయని గుర్తు చేస్తున్నారు. ఇపుడు జనసేనకు కూడా రెండు మంత్రి పదవులు ఇవ్వవచ్చు అని అంటున్నారు.

అయితే మాజీ మంత్రి కాపుసేన నేత అయిన చేగొండి హరిరామజోగయ్య కూటమి ప్రభుత్వంలో పవన్ కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయం గా పవన్ కూటమిలో ముఖ్య భూమిక పోషించాలని కోరుతున్నారు.

అయితే అది జరిగే పనేనా అంటే కూటమిలో టీడీపీ సోలోగా మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్లు సాధిస్తే కుదరదు అని అంటున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా చంద్రబాబు పూర్తి స్థాయిలో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే టీడీపీకి తక్కువ సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ కి తక్కువగా వస్తే మాత్రం అపుడు మిత్రుల పాత్ర కీలకం అవుతుంది. ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యే చాన్స్ ఉంటుంది.

కానీ ఆ విధంగా పరిస్థితులు ఎదురైనపుడు టీడీపీ అధినాయకత్వం వద్ద ప్లాన్ బీ కూడా రెడీగా ఉంటుందని అంటున్నారు. అదేలా అంటే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను ఆకట్టుకుని తన వైపు తిప్పుకుని మరీ అవసరం అయిన మెజారిటీని సాధించే నేర్పు రాజకీయ చాణక్యం కచ్చితంగా చంద్రబాబుకు ఉంటుందని అంటున్నారు.

బాబు వంటి రాజకీయ గండరగండడు ఉన్న కూటమిలో కీలక పాత్ర పోషించడం అన్నది ఎవరు అనుకున్నా అది కష్టమే అన్నది రాజకీయాల మీద అవగాహన ఉండే వారు చెప్పే మాట. మరి రాజకీయంగా విశేష అనుభవం ఉన్న జోగయ్య పవన్ కి ఈ సూచనలు చేస్తున్నారు అంటే ఆయనది ఆశ అనుకోవాలా లేక ఆరాటం అనుకోవాలా అన్నది కూడా ప్రశ్నలుగా వస్తున్నాయి. ఏది ఏమైనా ఆలూ లేదు చూలూ లేదు ఇప్పటి నుంచే కూటమిలో కీలక పాత్ర పెద్దన్న పాత్ర అంటూ దీర్ఘాలు తీస్తే అసలుకే ఎసరు వస్తుంది అని అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News