రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. బిహార్ కేడర్ ఐపీఎస్ అరెస్టు
ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు రాష్ట్రంలో తీవ్ర సంచలన చర్చగా మారింది. గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన రఘురామరాజుపై 2021లో సీఐడీ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు.;
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు కీలక మలుపు తిరిగింది. రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్, దాడికి పాల్పడిన తులసిబాబు అరెస్టు తర్వాత ఈ కేసు విచారణలో పురోగతి లేదన్న విమర్శలకు సిట్ చెక్ పెట్టింది. గతంలో సీఐడీ డిఐజీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అరెస్టు చేశారు. ఈయన ప్రస్తుతం బిహార్ కేడరులో ఉన్నారు. అరెస్టు నుంచి రక్షణకు ముందస్తు బెయిలు పిటిషన్ పెట్టుకున్న సునీల్ నాయక్ విజ్ఞప్తిని గుంటూరు కోర్టు కొట్టివేసింది. దీంతో బిహార్ వెళ్లిన ఏపీ పోలీసులు అక్కడ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అరెస్టు చేశారు. టాన్సిట్ వారెంటుపై రాష్ట్రానికి తరలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు రాష్ట్రంలో తీవ్ర సంచలన చర్చగా మారింది. గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన రఘురామరాజుపై 2021లో సీఐడీ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సీఐడీ సుమోటాగా కేసు నమోదు చేయడమే కాకుండా, ఆయన పుట్టిన రోజు నాడే అంటే మే 14వ తేదీన హైదరాబాద్ నుంచి అరెస్టు చేసి గుంటూరు తరలించారు. అరెస్టు చేసిన రోజు రాత్రి రఘురామపై సీఐడీ పోలీసుల సమక్షంలో కొందరు దాడి చేసినట్లు ఆయన 2024లో ఫిర్యాదు చేశారు.
గత ప్రభుత్వంలో తనపై దాడి జరిగినా పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని రఘురామరాజు ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వం రాగానే రఘురామ ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఇందులో మాజీ సీఎం జగన్మోహనరెడ్డితోపాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, డీఐజీ సునీల్ నాయక్, అప్పటి ఏఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని నిందితులుగా చేర్చుతూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి ఏఎస్పీ విజయపాల్ ను, దాడి చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న తులసిబాబును గతంలోనే అరెస్టు చేశారు.
అయితే రఘురామ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, సీనియర్ అధికారుల ప్రమేయం ఉండటంతో దిగువస్థాయి పోలీసు అధికారులు విచారణ చేయలేకపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తోంది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సాగిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయని అంటున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ను ఈ కేసులో నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.
తాజాగా అప్పటి డీఐజీ సునీల్ నాయక్ ను అరెస్టు చేయడంతో నెక్ట్స్ ఎవరు? అన్న చర్చ జరుగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ లను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయితే ఆ ఇద్దరి సస్పెన్షన్ కు ఈ కేసుకు సంబంధం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో డీఐజీ సునీల్ నాయక్ అరెస్టు తర్వాత సిట్ ఎవరిపై ఫోకస్ పెడుతుందని ఉత్కంఠ నెలకొందని అంటున్నారు.