పవన్ ఇది కూడా చేసుంటే బాగుండేదా ..!
జనసేన వర్గాల్లో కీలకమైన విషయం చర్చకు వచ్చింది. రెండు రోజుల పాటు వరసుగా తిరుపతి జిల్లాల్లో పవన్ పర్యటించారు.;
జనసేన వర్గాల్లో కీలకమైన విషయం చర్చకు వచ్చింది. రెండు రోజుల పాటు వరసుగా తిరుపతి జిల్లాల్లో పవన్ పర్యటించారు. నిజానికి జనసేన విజయం దక్కించుకున్న తర్వాత.. నాలుగు సార్లు తిరుపతికి వెళ్లిన పవన్ కల్యాణ్.. పలు కీలక విషయాలపైనే దృష్టి పెట్టారు. వీటిలో సనాతన ధర్మ దీక్షలో భాగంగా ఒకసారి.. పార్టీ కార్యక్రమం కోసం మరోసారి.. ఆయన పర్యటించారు. తాజాగా అటవీ సంపద, కుంకీ ఏనుగుల సంరక్షణ శిబిరం ప్రారంభించేందుకు వెళ్లారు.
అయితే.. తాజా పర్యటనకు సంబంధించి జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు రోజుల పాటు వరు సగా తిరుపతికి వచ్చిన ఆయన పార్టీ పరంగా ఎవరితోనూ.. చర్చించలేదు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గంలో జనసేన నాయకుడు ఆరణి శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి రాజకీయా లపై పవన్ చర్చించి ఉంటే బాగుండేదన్న చర్చ సాగుతోంది. ఇతర పార్టీల్లో ఉన్నట్టుగానే.. జనసేనలో నూ.. వివాదాలు కొనసాగుతున్నాయి.
పార్టీల్లో ఇవన్నీ సహజమే అయినా.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగాలి. శ్రీకాళహస్తి వివాదం నుంచి తిరుపతి నియోజకవర్గంలో నెలకొన్న వివాదాల వరకు జనసేన పార్టీపై రాజకీయ వర్గాలు, సోషల్ మీడియాలోనూ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. పార్టీ పరంగా ఒకరిద్దరిపై చర్యలు తీసుకున్నా.. పరిస్థితులు సర్దుమణగలేదు. చాలా మంది నాయకులు.. పవన్ నిర్ణయం.. ఆయన దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం.
ఈ క్రమంలో రెండు రోజులు వరుస పర్యటనలు చేసిన పవన్ కల్యాణ్.. స్థానికంగా రెండు మూడు నియోజ కవర్గాల్లో నెలకొన్న వివాదాలపై స్పందిస్తారని నాయకులు ఎదురు చూశారు. కానీ.. పవన్ మాత్రం కేవలం అధికారిక పర్యటనలు ముగించుకుని వెళ్లిపోయారు. వాస్తవానికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఇటీవల కాలంలో ఎక్కడైనా పర్యటిస్తే.. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలానే తమ సమస్యలు కూడా పరిష్కరిస్తే బాగుండేదన్న చర్చ జనసేనలో జరిగింది.