తమిళనాడు పిలుస్తోంది పవన్ !

సినీ నటుడు రాజకీయ నాయకుడుగా మారిన పవన్ కళ్యాణ్ కి ఉన్న సౌలభ్యత ఎవరికీ ఉండదు.;

Update: 2025-06-25 04:26 GMT

సినీ నటుడు రాజకీయ నాయకుడుగా మారిన పవన్ కళ్యాణ్ కి ఉన్న సౌలభ్యత ఎవరికీ ఉండదు. మామూలుగా రాజకీయాలు చేసే రెగ్యులర్ పొలిటీషియన్ కి అసలు ఈ తరహా వెసులుబాటు ఉండదు. ఎందుకంటే పవన్ స్క్రీన్ ఇమేజ్ ఆకాశమంతా. అది విస్తరించే పరిధి భూమండలమంతా.

ఎక్కడ తెర ఉంటే అక్కడ పవన్ అలా పరచుకుపోతారు. అందుకే ఆయన సినీ గ్లామర్ రాజకీయాల్లో రక్షణ కవచంగా ఉంటూ కాపాడుతోంది. ఇక చూస్తే తెలుగు నాట రెండు రాష్ట్రాలలో పవన్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వస్తారు. పవన్ కూడా ఏ చోటకు వెళ్ళినా ఆ రిఫరెన్స్ తెస్తూ తాను స్థానికుడినే అన్న ఫీలింగ్ ఇస్తూ ఉంటారు.

ఇపుడు తెలుగు నాట దాటి తమిళనాడుకు పవన్ వెళ్లారు. అక్కడ కూడా తాను తమిళనాడు కల్చర్ ని అభిమానిస్తాను అని పవన్ చెప్పుకున్నారు. తాజాగా మురుగన్ మహా భక్తి అమ్మేళనంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆధ్యాత్మికతతో కూడిన ప్రసంగం ఆసక్తిని పెంచింది.

ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఎవరికి తగలాలో వారికే తగిలాయి. అందుకే పవన్ పర్యటన ఇలా పూర్తి అయిందో లేదో అలా రీ సౌండ్ వస్తొంది. పవన్ తమిళ పర్యటన మీద ఇప్పటికే డీఎంకే విమర్శలు చేస్తూ వస్తోంది. తాజాగా అధికార డీఎంకే నుండి ఒక గట్టి సవాల్ అయితే పవన్ కి వచ్చింది

పవన్‌కల్యాణ్‌ ని ఏకంగా తమిళనాడుకి పిలిచి మరీ పోటీ చేయమంటున్నారు డీఎంకే మంత్రి శేఖర్‌బాబు. తమిళనాడుకు తరచూ వస్తూ బీజేపీ వారి సభలు సమావేశాలలో పాలుపంచుకుంటున్న పవన్ కి ఒక పదునైన సవాల్ నే ఆయన విసిరారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా పవన్ అని ఆయన నిగ్గదీశారు.

మీరు చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయండి అని ఆఫర్ కూడా ఇచ్చేశారు. అంతే కాదు తమిళనాడు ఎన్నికల్లో పవన్‌ గెలిచి చూపించాలని అన్నారు. అలా పవన్ గెలిచిన తర్వాత ఆయన ఎన్నిచెప్పినా వినడానికి సిద్ధం అని డీఎంకే అంటోంది. అంతే కాదు అసలు తమిళనాడుతో పవన్‌కు ఏం సంబంధం ఉంది అని ఒక లాజిక్ తో కూడిన ప్రశ్నను సంధిస్తోంది

అంతే కాదు అక్కడ అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రశ్నించడానికి పవన్‌కల్యాణ్ ఎవరు అని నిలదీస్తోంది. ఇక బీజేపీ మాయలో మత రాజకీయాలను ప్రోత్సహించవద్దు పవన్ అని అంటోంది. తాము దేవదాయశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. అంతే కాదు పవన్‌ మాటలు నమ్మడానికి తమిళ ప్రజలు సిద్దంగా లేరని తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు చెబుతున్నారు.

అయితే ఈ చివరి మాటలే కాస్తా విడ్డూరంగా ఉన్నాయని అంటున్నారు. పవన్ ని నమ్మడానికి తమిళ ప్రజలు సిద్ధంగా లేకపోతే మంత్రి గారికి ఎందుకు అంత ఆయాసం అని అంటున్నారు. ఎవరు కాదన్నా పవన్ కి బ్రహ్మాండమైన సినీ ఇమేజ్ ఉంది. దాంతో పాటు ఆయనకు రాజకీయంగా ఉండాల్సిన ఇమేజ్ సైతం ఉంది.

దాంతో పవన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు వెల్లువలా వస్తారు. ఆయన ప్రసంగాలు శ్రద్దతో ఆలకిస్తారు. పవన్ సైతం తనదైన శైలిలో ఆకట్టుకుంటారు. తమిళనాడు బీజేపీకి ఇపుడు పవన్ బాగా అందుకు వస్తున్నారు. దాంతో అధికార డీఎంకేకి కాస్తా మంటగా ఉంది అని అంటున్నారు. పైగా సనాతన ధర్మం గురించి పవన్ చాలా చెబుతున్నారు.

అదే తమిళనాడు నుంచి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మం గురించి ఎంతగా విమర్శలు చేశారో కూడా అంతా చూశారు అని అంటున్నారు. తమిళనాడు చూస్తే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉంటుంది. అక్కడ ఉన్నన్ని మఠాలు క్షేత్రాలు ఆలయాలు దేశంలో ఎక్కడా లేవు. అలాంటి చోట సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. అదే విచిత్రం అని అంటారు.

మరి భక్తి సమ్మేళనం బీజేపీ నిర్వహించడం పవన్ వెళ్లడంతో రాజకీయ సన్నివేశంలో భారీ మార్పు వస్తోంది అని అంటున్నారు. అందుకే డీఎంకే పవన్ ని గట్టిగా విమర్శిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ కి తమిళనాడు నుంచి పిలుపులు వస్తున్నాయి. మరి ఆయన ఏమి చేస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News