ఆ ఊరికి మామిడి పండ్లతో సర్ ప్రైజ్ చేసిన పవన్
పవన్ కు వ్యవసాయం అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్ లో ఆర్గానిక్ పద్దతిలో వ్యవసాయం చేస్తుంటారు.;
కొందరికి తీసుకోవటంలో ఆనందం ఉంటుంది. మరికొందరికి ఇవ్వటంలో ఆనందం ఉంటుంది. సాధారణంగా రాజకీయ నాయకులు అన్నంతనే ఇన్ కమింగే కానీ అవుట్ గోయింగ్ అన్నది తక్కువగా ఉంటుంది. కానీ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం భిన్నం. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా.. ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్సు రూపంలో అస్సలు ఉండదు. వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఇచ్చేయటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. అంతేనా.. తనకు అవకాశం ఉన్న ప్రతి విషయంలోనూ తన శక్తి మేర ఇవ్వటమే తప్పించి.. తీసుకోవటానికి ఇష్టపడని అరుదైన వ్యక్తిత్వం పవన్ సొంతం.
పవన్ కు వ్యవసాయం అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్ లో ఆర్గానిక్ పద్దతిలో వ్యవసాయం చేస్తుంటారు. చెట్లు.. మొక్కల్ని పెంచుతుంటారు. అందులో మామిడి చెట్లు కూడా ఒక భాగం. తన తోటలో పండించే మామిడిపండ్లను ఎంపిక చేసిన కొందరికి పంపుతుంటారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు.. తన తోటలో పండించే మామిడి పండ్లను అదే రేంజ్ లో ఉన్న వారికే పంపుతారనుకుంటే తప్పులో కాలేసినట్లే.
ఎందుకంటే పవన్ ఎంపిక కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ స్థాయిల్ని చూడరు. వాటిని అస్సలు పట్టించుకోరు. తాజాగా తన తోటలో పండిన మామిడి పండ్లను అల్లూరి సీతారామ జిల్లా కురిడి గ్రామస్థులకు మామిడి పండ్లను పంపారు. దాదాపు 230 ఇళ్లు ఉండే ఈ ఊళ్లోని ప్రతి కుటుంబానికి అరడజను చొప్పున మామిడి పండ్లను పంపి తన పెద్ద మనసును చాటారు.
తన సిబ్బందికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి.. ప్రత్యేక వాహనంలో ఆ గ్రామానికి మామిడి పండ్లను పంపారు. ఇంతకూ ఆ ఊరికే ఎందుకు మామిడి పండ్లను పంపినట్లు? అన్న సందేహం కలగొచ్చు. దానికో లెక్కుంది. ఇటీవల ‘అడవి తల్లి బాట’ ప్రోగ్రాంను షురూ చేసిన పవన్.. అందులో భాగంగా అల్లూరి జిల్లాలోని ఢుంబ్రిగూడ మండలంలోని పెద్దపాడు.. కురిడి గ్రామానికి వెళ్లటం జరిగింది.
ఆయా ఊళ్లకు రోడ్ల కష్టాల్ని తీర్చేందుకు రోడ్లకు శంకుస్థాపన చేసిన ఆయన.. వారితో మాట్లాడి వారి కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. కురిడి గ్రామంలోని శివాలయంలో పూజలు చేశారు. గ్రామంలోని తిష్ట వేసిన సమస్యల్ని తొలగించేందుకు ఒక్కొక్కటిగా తీరుస్తున్న ఆయన.. ఆ ఊరి మీద ప్రత్యేక మమకారాన్ని పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగతంలో తన తోటలో పండిన మామిడి పండ్లను ప్రత్యేకంగా ఊరంతటికి పంపటంతో వారు తెగ ఖుషీ అవుతున్నారు. మా పవన్ సారు పంపిన మామిడి పండ్లు అంటూ అపురూపంగా చూపిస్తున్న వైనం అందరిని ఆకట్టుకుంటోంది. పెద్ద మనసు అనే మాటను తరచూ వింటాం. కానీ.. చూసేది తక్కువ. ఆ విషయంలో పవన్ తో పోటీ పడే రాజకీయ నాయకుడు అరుదుగా ఉంటారని చెప్పక తప్పదు.