పిఠాపురం పైన పవన్ ఫుల్ ఫోకస్...తెరపైకి కీలక నేతలు !
పిఠాపురం జనసేన ఇంచార్జి గా మర్రెడ్డి శ్రీనివాసరావుని తీసుకుంటే ఆయన సొంతంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు.;
పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కదా. మళ్ళీ ఫుల్ ఫోకస్ ఏమిటి అని ఆశ్చర్యపోనవసరం లేదు. పవన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు రాష్ట్ర స్థాయి పార్టీకి అధ్యక్షుడు. పైగా ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దాంతో ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. గతంలో దశాబ్దాలుగా నోచుకోని అనేక కార్యక్రమాలను తన హయాంలో నిధులు భారీగా ఇచ్చి మరీ సాకారం అయ్యేలా చూస్తున్నారు. అలా తన పదవీ కాలంలో పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్ అసెంబ్లీ సీటుగా చేయాలని తపన పడుతున్నారు.
కలవరపెడుతున్న విషయం :
అయితే పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు చూసుకుంటున్న వేళ పిఠాపురంలో జనసేనలో వర్గ పోరు కలవరపెడుతోంది అని అంటున్నారు. పార్టీ తరఫున పిఠాపురం ఇంచార్జిగా ఒక నేతను నియమిస్తే ఆయన అందరినీ కలుపుకుని పోవడంలేదని విమర్శలు వస్తున్నాయి ఇతర నేతలు వేరుగా ఉంటున్నారు దాంతో ఇదే మాదిరిగా ఊరుకుంటే ఇబ్బందులు తప్పవని గ్రహించిన పవన్ రంగంలోకి దిగి మొత్తం పరిస్థితిని అంచనా వేశారు.
ఒంటెద్దు పోకడలకు చెక్ :
పిఠాపురం జనసేన ఇంచార్జి గా మర్రెడ్డి శ్రీనివాసరావుని తీసుకుంటే ఆయన సొంతంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు. దాంతో పాటుగా జనసేన పార్టీ ఆఫీసు ఒకటి పిఠాపురంలో ఉండగా వేరే చోట నుంచి తన సొంత ఆఫీసుని నడపడం మీద కూడా నేతల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబులతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావును ఆ కమిటీలో నియమించారు. అలా ఫైవ్ మెన్ కమిటీ ఇక మీదట ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటుందని పవన్ స్పష్టం చేశారు.
పవన్ నివాసమే కేంద్రంగా :
అంతేకాదు పవన్ కి చేబ్రోలులో ఉన్న నివాసం నుంచే జనసేన పార్టీ కార్యక్రాలు జరుగుతాయని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. పిఠాపురంలో పార్టీ కార్యకర్తలను అందరినీ ఈ ఫైవ్ మెన్ కమిటీ కలుస్తుందని కో ఆర్డినేషన్ తో పార్టీని ముందుకు తీసుకుని వెళ్తుందని చెబుతున్నారు. ఎలాంటి వర్గ పోరుకు పొరపొచ్చాలకు తావు లేకుండా చూడాలని కూడా అధినేత ఆదేశించినట్లుగా పేర్కొంటున్నారు. మరి జనసేన ఇక మీదట అయినా వర్గ పోరుని మరచి అంతా ఒక్కటిగా ముందుకు సాగుతారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే అధికారం ఉన్న చోటనే ఆధిపత్యం పోరు ఉంటుంది. నాయకులు అందరినీ కలపడం ఒక ఎత్తు మాత్రమే. వారి అందరొ చూపూ ఒకే వైపు ఉందా లేదా అన్నదే అసలైన కసరత్తు అని అంటున్నారు.