ఏడాది ప్రొగ్రెస్ కార్డు ఇదే.. పవన్ వన్ ఇయర్ జర్నీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వన్ ఇయర్ జర్నీపై ప్రజలకు ప్రొగ్రెస్ కార్డు సమర్పించారు.;

Update: 2025-06-20 12:02 GMT
ఏడాది ప్రొగ్రెస్ కార్డు ఇదే.. పవన్ వన్ ఇయర్ జర్నీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వన్ ఇయర్ జర్నీపై ప్రజలకు ప్రొగ్రెస్ కార్డు సమర్పించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో తమ ప్రభుత్వం ఏం చేసిందో అందులో పూర్తిగా వివరించారు. వచ్చే నాలుగేళ్లలో ఏం చేస్తామో కూడా చెప్పారు. సాధారణంగా ఇలాంటి నివేదికలను సీఎం చంద్రబాబు విడుదల చేస్తుంటారు. కానీ, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును అనుసరిస్తూ ప్రజలకు తన పనితీరుపై నివేదిక సమర్పించారు.

గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపించామని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. ప్రజల్లోనూ పెట్టుబడిదారుల్లోనూ విశ్వాసం నింపడానికి కృషి చేశామని తెలిపారు. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని వెల్లడించారు. స్వర్ణాంధ్ర-2047 సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని, బాధ్యతలు స్వీకరించిన ఏడాది పూర్తయిన సందర్భంగా 20 పేజీల నివేదిక విడుదల చేస్తున్నామని తెలిపారు.

‘‘ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం, గ్రామ స్వరాజ్యానికి ముందడుగు.. హరితాంధ్ర సాధనకై మరో అడుగు’’ అంటూ ప్రజలకు నివేదిక సమర్పించారు పవన్. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమికి అండగా నిలబడి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, నిరంతరం పరితపించే తాను చేపట్టిన శాఖల ద్వారా ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచడం నైతిక బాధ్యతగా భావిస్తున్నానని పవన్ తెలిపారు.

ఏడాదిలో తన శాఖ పరిధిలో 1,312 కిలోమీటర్ల మేర 449 బీటీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. రూ.649 కోట్లు వెచ్చించామని వెల్లడించారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.589 కోట్లు కేటాయించారని తెలపారు. గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ రోడ్లకు మరమ్మతులు చేపట్టమని తెలిపారు. ఉపాధి నిధులతో 4 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్ల నిర్మాణం, గ్రామాలను కలిపేలా 276 కి.మీ. బీటీ రోడ్ల నిర్మాణం, 78 వేల నీటి కుంటలు, 22,500 గోకులాల షెడ్ల నిర్మాణం, 15 వేల పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. 1877 నివాస ప్రాంతాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించారు. 1137 గిరిజన గ్రామాలకు రహదారి సమస్యలను పరిష్కరించారు. ఆయా గ్రామాలకు డోలీ మోతల బాధలు తప్పించారు. ఇక తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.

Tags:    

Similar News