పవన్ నోట ‘జెన్ జీ’ మాటలు.. జనసేన ఫ్యూచర్ ప్లాన్ ఇదేనా?

‘గత ఎన్నికల్లో మిలీనియల్స్ మనకు మద్దతుగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో జెన్ జడ్ వారిని ఆకట్టుకునేలా పనిచేయాలి’ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.;

Update: 2025-10-05 12:40 GMT

‘గత ఎన్నికల్లో మిలీనియల్స్ మనకు మద్దతుగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో జెన్ జడ్ వారిని ఆకట్టుకునేలా పనిచేయాలి’ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల నేపాల్ అల్లర్ల సందర్భంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘జెనరేషన్ గ్రూప్స్’ మన దేశంలో రాజకీయంగా గుర్తింపు తెచ్చుకుంటున్నట్లు పవన్ వ్యాఖ్యల బట్టి అర్థమవుతోందని అంటున్నారు. నేపాల్లో జెన్ జెడ్ ఉద్యమంతో యువత అక్కడి ప్రభుత్వాన్ని గద్దె దింపారు. అయితే ఏపీలో కూడా గత ఎన్నికల్లో మిలీనియల్స్ గా చెప్పుకునే జనరేషన్ వై గ్రూపు కూటమికి మద్దతుగా నిలిచి అఖండ విజయాన్ని కట్టబెట్టారని పవన్ ఈ సందర్భంగా చెప్పారు.

వారం రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడిన డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తుతం కోలుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన జ్వరం బారిన పడటంతో ఎమ్మెల్యేలతో మాట్లాడలేకపోయారు. ఇక శనివారం రాష్ట్రానికి వచ్చిన డీసీఎం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై ఎమ్మెల్యేలతో జనసేనాని మాట్లాడారు. ఇందులో ప్రధానంగా వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎమ్మెల్యేకు 5 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీలో అందరికీ సమప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో పవన్ మిలీనియల్స్ మద్దతుపై వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో మిలీనియల్స్ జనసేనకు అండగా నిలిచారని పవన్ వెల్లడించారు. ‘మనం ఇప్పుడు మిలీనియల్స్ ఆకాంక్షలు గ్రహంచాలి. జెన్ జీ తరంతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చర్చిస్తూ ఉండండి. వాళ్లు ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ ను నిర్మించి వందల కోట్లు వృధా చేసిందన్న విషయం తెలిసిన యువత జనసేనతో కలిసి నడిచినట్లు పవన్ వెల్లడించారు.

1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్ లేదా జనరేషన్ వైగా పిలుస్తారు. వీరు కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన సమయంలో పెరిగారు. ఇక 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ గా పిలుస్తున్నారు. నేపాల్ లో ఉద్యమించిన ఈ తరం అక్కడి ప్రభుత్వాన్ని గద్దె దిగేలా చేసింది. ఇక పవన్ చెప్పిన ప్రకారం గత ఎన్నికల్లో 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత జనసేనకు అండగా నిలిచారని విశ్లేషిస్తున్నారు. వాస్తవంలో కూడా ఇదే నిజమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువత మద్దతు పొందితే భవిష్యత్తులోనూ బలంగా ఉండొచ్చే ఆకాంక్ష పవన్ మాటల్లో కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో భవిష్యత్తు తరాన్ని ఆకట్టుకునేలా అడుగులు వేయాలని పవన్ సూచిస్తున్నారు. దీనిద్వారా జనసేన ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News