తమిళ సమరంలో జనసేనాని ఎంట్రీ

తమిళనాడు ఎన్నికలు ఒక కీలక దశకు చేరుకున్నాయి. ఈ నెల 23వ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.;

Update: 2026-04-05 13:07 GMT

తమిళనాడు ఎన్నికలు ఒక కీలక దశకు చేరుకున్నాయి. ఈ నెల 23వ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. దానికి నలభై ఎనిమిది గంటల ముందు అంటే 21న సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారానికి పరిసమాప్తం అవుతుంది. గట్టిగా చూస్తే పదిహేను రోజుల సమయం లేదు. ఇక దక్షిణాదిన పెద్ద రాష్ట్రం అయిన తమిళనాడుకు 234 సీట్లు ఉన్నాయి. భౌగోళికంగా పెద్ద ప్రాంతం కావడంతో పాటు అనేక ప్రాంతాలు పరిస్థితులు రాజకీయ స్వరూప స్వభావాలలో తేడా ఉంటుంది. అలాగే సామాజిక సమీకరణలు కూడా భిన్నంగా ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి.

భీకరమైన పోరు :

ఇక తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలలో భీకరమైన పోరు సాగనుంది. అధికార డీఎంకే బలంగా ఉంది. అనేక ఇతర పార్టీలను కలుపుకుని మరీ పటిష్టం అయింది. ఇక ప్రతిపక్ష అన్నా డీఎంకే సంగతి చూస్తే కనుక గ్రామీణ ప్రాంతాలలో మొదటి నుంచి బలం ఉంది. నాయకత్వంతో సంబంధం లేకుండా క్యాడర్ అటు డీఎంకేకు ఇటు అన్నా డీఎంకేకు మధ్య చీలిపోయారు. దాంతో ఈ రెండు పార్టీలకే చెరో నలభై ఓటు షేర్ కచ్చితంగా ఉన్న స్థితి కనిపిస్తోంది. ఈ మధ్యలో కొత్త పార్టీగా తమిళ దళపతి విజయ్ స్థాపించిన టీవీకే ఉంది. ఆ పార్టీకి విజయ్ సూపర్ స్టారిజమే ప్రధాన బలం. అంతే కాదు ఆయన చెబుతున్న ద్రవిడ వాదం మరో అనుకూల అంశం కానుంది. యువతతో పాటు జెడ్ జెన్ ఎక్కువగా విజయ్ పార్టీ వైపు ఉన్నారని అంచనాలు ఉన్నాయి.

సీన్ లోకి పవన్ :

ఇల త్రిముఖ పోరుగా ఉన్న తమిళనాడు సీమలోని ఎన్నికల సీన్ లోకి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఎన్డీయేలో ముఖ్య భాగస్వామిగా ఉన్నారు. దాంతో ఏపీ పొరుగున ఉన్న తమిళనాడులో పవన్ ద్వారా ప్రచారం చేయించి లాభపడాలని ఎన్డీయే జాతీయ స్థాయి పెద్దలు నిర్ణయించడంతో పవన్ ప్రచారానికి వెళ్తున్నారు. ఆయన ఏప్రిల్ 6న తమిళనాడులోని తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేస్తారు అని అంటున్నారు. ఆయన ప్రచారం నాగర్ కోయిల్ నియోజకవర్గంలో సాగుతుందని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఎం ఆర్ గాంధీ తరఫున పవన్ ప్రచారం చేస్తారు. పవన్ కి సినీ క్రేజ్ తో పాటు పొలిటికల్ గా ఉన్న ఇమేజ్ తో బీజేపీకి ఎన్డీయేకి లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఏ రకమైన సంచలనాలు నమోదు అవుతాయో చూడాల్సి ఉంది.

మరో విడత సైతం :

తమిళనాడులో పవన్ కళ్యాణ్ ప్రచారం లో తొలి విడతగా దీనిని చెబుతున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారానికి మరి కొన్ని రోజులు ఉన్నందున మలి విడత ప్రచారానికి కూడా ఆయన రావచ్చు అని అంటున్నారు. బీజేపీ అభ్యర్ధులు పోటీ చేస్తున్న ప్రాంతాలలో పవన్ ప్రచారం చేస్తారు అని అంటున్నారు. అదే సమయంలో అన్నా డీఎంకే తో కూడిన కూటమి అభ్యర్ధుల కోసం బహిరంగ సభలలో కూడా పాల్గొనే వీలు ఉందని అంటున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయం అంటే సినీ గ్లామర్ విత్ పొలిటికల్ స్టైల్. పవన్ కళ్యాణ్ ఏపీలో ఈ రెండింటినీ మిక్స్ చేసి విజయం అందుకున్నారు. ఆయన గతంలో ఎక్కడ ప్రచారం చేసినా విజయాలే నమోదు అయ్యాయి దాంతో ఈసారి కూడా ఎన్ డీయేకు ఆయన భారీ లాభం చేకూరుస్తారా అన్న చర్చ సాగుతోంది అంతే కాదు ఆయన ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలను ముందుకు తీసుకుని వస్తారు అన్నది కూడా ఇంకో చర్చగా ఉంది.

Tags:    

Similar News