పవన్ కి కోపం తెప్పించిన ఆ ఎమ్మెల్యే ఎవరు? కూటమిలో పెద్ద డిబేట్

భీమవరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ సీరియస్ అయ్యారు.;

Update: 2025-10-22 05:56 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి కోపం వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో పేకాట శిబిరాల నిర్వహణతోపాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ డీఎస్సీపై డిప్యూటీ సీఎం ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. సదరు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డీజీపీతోపాటు హోంమంత్రి అనితకు సూచించారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యారనేదే ఇప్పుడు పెద్ద డిబేట్ గా మారింది. ఓ డీఎస్పీ స్థాయి అధికారిపై పవన్ ఫోకస్ చేయడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా కూటమిలో ఓ కీలక ఎమ్మెల్యే వల్లే పవన్ రియాక్ట్ అవ్వాల్సివచ్చిందని చర్చ ఆసక్తి రేపుతోంది.  

భీమవరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ సీరియస్ అయ్యారు. జూదం వల్ల తమ ఇల్లు గుల్ల అవుతోందని పలువురు డిప్యూటీ సీఎం పవన్ కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఆయన పార్టీ నేతల ద్వారా డీఎస్పీ జయసూర్య ద్రుష్టిలో పెట్టినట్లు చెబుతున్నారు. అయితే పవన్ చెప్పినప్పటికీ డీఎస్పీ ఉదాసీనంగా వ్యవహరించడం ఆయనకు కోపం తెప్పించిందని అంటున్నారు. అయితే ఏకంగా డిప్యూటీ సీఎం ఆదేశాలనే డీఎస్పీ లైట్ తీసుకోవడానికి కారణాలు ఏం అయివుంటాయనేది హాట్ డిబేట్ గా మారింది. దీనికి కారణం కూటమిలోని ఓ ఎమ్మెల్యే అంటూ ప్రచారం జరుగుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నుంచి జనసేన ఎమ్మెల్యేలు రామాజంనేయులు, బొలిశెట్టి శ్రీనివాసరావు, బొమ్మిడి నాయకర్ జనసేన నేతలు. ఇక టీడీపీ నుంచి ఉండిలో రఘురామక్రిష్ణంరాజు, ఆచంటలో పితాని సత్యనారాయణ, తణుకులో రాధాక్రిష్ణ, పాలకొల్లులో మంత్రి రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు పవన్ కోపానికి కారణమయ్యారనే టాక్ వినిపిస్తోంది. భీమవరం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేసినప్పటికీ ఓ ఎమ్మెల్యే ఆ బదిలీని ఆపడంతోపాటు కొత్తగా ఎవరూ రాకుండా అడ్డుకున్నారని అంటున్నారు. దీంతో డీఎస్పీ జయసూర్య పూర్తిగా ఆ ఎమ్మెల్యే కంట్రోల్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలను లెక్కచేయకపోవడంతో పవన్ కల్పించుకోవాల్సివచ్చిందని అంటున్నారు.

ఇక పవన్ ఆగ్రహంతో డీఎస్పీపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, ఆయన ఆగ్రహానికి కారణమైన ఎమ్మెల్యే ఎవరన్నదే అందరి మెదళ్లను తొలిచేస్తోంది. ఏడుగురు ఎమ్మెల్యేల్లో మంత్రి నిమ్మల రామానాయుడు విషయంలో పవన్ సంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ముగ్గురిపైన డిప్యూటీ సీఎంకి ఫిర్యాదులు లేవనే అంటున్నారు. ఇక మిగిలిన ముగ్గురిలో పవన్ కు కోపం తెప్పించిన నేత ఎవరై ఉంటారనేదే కూటమి పార్టీల్లో బిగ్ డిబేట్ కు కారణమవుతోంది. టీడీపీకి చెందిన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే రాధాక్రిష్ణల్లో ఎవరో ఒకరు పవన్ కోపానికి కారణంగా చెబుతున్నారు. అయితే, ఈ ముగ్గురితోనూ పవన్ కు సత్సంబంధాలే ఉన్నాయని, కానీ డీఎస్పీ వ్యవహారశైలి సరిగా లేకపోవడంతోనే పవన్ సీరియస్ అవ్వాల్సివచ్చిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

డీఎస్పీ విషయంలో సదరు ఎమ్మెల్యేతో మాట్లాడి.. అనసవర వివాదానికి తెరలేపడం ఎందుకన్న ఆలోచనతోనే పవన్ నేరుగా డీజీపీతో మాట్లాడారని, అదేవిధంగా ప్రొటోకాల్ ప్రకారం హోంమంత్రి అనితకు ఫిర్యాదుల కాపీలు పంపినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేల విషయంలో పవనుకు అసంతృప్తి లేకపోయినా, వారి జోక్యం వల్లే డీఎస్పీ చెలరేగిపోతున్నారనే ఆలోచనతోనే సీరియస్ యాక్షన్ కు దిగినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News