డిప్యూటీ సీఎం పదవికి పవన్ అనర్హుడు.. సీపీఐ నారాయణ ఫైర్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ముప్పేట దాడి ఎక్కువ అవుతోంది. గత బుధవారం రాజోలు పర్యటన సందర్భంగా పవన్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.;

Update: 2025-12-03 10:41 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ముప్పేట దాడి ఎక్కువ అవుతోంది. గత బుధవారం రాజోలు పర్యటన సందర్భంగా పవన్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ముందుగా తెలంగాణ బీఆర్ఎస్ మండిపడగా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంటరై నానా యాగీ చేస్తున్నారని అంటున్నారు. ఇక తాజాగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండగా, కమ్యూనిస్టు పార్టీ కూడా మేము సైతం అన్నట్లు పవన్ పై మాటల తూటాలు పేల్చుతోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ‘దిష్టి’ పెట్టారంటూ పవన్ మాట్లాడటం కరెక్టు కాదన్న సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ మండిపడ్డారు.

ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ అనర్హుడని, ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ ప్రజల మధ్య సత్సంబంధాలే కొనసాగుతున్నాయని నారాయణ గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఏకైక కుమార్తెను ఏపీకి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం దీనికి నిదర్శనమని నారాయణ వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో చేగువేరా తనకు ఆదర్శమని చెప్పిన పవన్ ఇప్పుడు సామర్కర్ భుజానకెత్తుకుని సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా సనాతన ధర్మంపై ఆసక్తి ఉంటే రాజకీయాలు వదిలిపెట్టి ఆ మార్గంలో వెళ్లవచ్చునని సూచించారు. ‘దిష్టి తగిలింది’ వంటి మాటలు మాట్లాడే సనాతన వాదులకు రాజకీయాల్లో ఉండే అనర్హత లేదని నారాయణ వ్యాఖ్యానించారు.

పవన్ రాజకీయాలకు తగరని, ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు. కాగా, గత నెల 26న రాజోలు నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన పవన్.. కోనసీమ అందాలు, కొబ్బరితోటల పచ్చదనంపై సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ నేతలు కోనసీమ అందాలను గొప్పగా చెప్పేవారని, వారి దిష్టి తగిలిందేమో కోనసీమ కొబ్బరి తలలు వాల్చేసిందంటూ వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ నేతలు పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. బీజేపీతో చేతులు కలిపిన పవన్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆయనను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. తాజాగా వైసీపీ, సీపీఐ వంటి పార్టీలు కూడా ఈ వివాదంలోకి ఎంటర్ అవడం ఆసక్తి రేపుతోంది.

అయితే కొద్ది రోజులుగా పవన్ పై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విరుచుకుపడుతుంటే.. ఏపీలోని కూటమి నేతలు మాత్రం అసలు ప్రతిస్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ మాత్రమే వివరణ ఇస్తూ వివాదాన్ని సామరస్యంగా ముగించాలనే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. ఈ విషయంపై పవన్ ఇమేజ్ ను డామేజ్ చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, తాజాగా సీపీఐ నారాయణ వంటివారు విమర్శలు గుప్పించడం, టీడీపీ, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇవ్వకపోవడం వల్ల పవన్ కు ఎక్కువ నష్టం జరుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News