తమిళనాడు ప్రజలు బీజేపీని కోరుతున్నారు: పవన్
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. పలు అంశాలపై ఆయన స్పందించారు.;
తమిళనాడు ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తాజాగా చెన్నైలో పర్యటి స్తున్న ఆయన వన్ నేషన్-వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. పలు అంశాలపై ఆయన స్పందించారు.
+ తమిళనాడు ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు కారణంగానే ఏపీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని.. కాబట్టి ఇక్కడి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నా రని పవన్ వ్యాఖ్యానించారు.
+ వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది కీలకమైన నిర్ణయమన్న పవన్.. దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యయనం కూడా చేశారని చెప్పారు. దీనివల్ల ప్రజలకు, ప్రభుత్వాలకు కూడా సౌకర్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నది వాస్తవమేనని ఆయన చెప్పారు.
+ ఈవీఎంలను కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వారు అధికారంలోకి వచ్చింది కూడా..ఈ ఈవీఎంల ద్వారానేనని.. కానీ, వారు అధికారం కోల్పోయినప్పుడు మాత్రం ఈవీఎంలను తప్పుబడుతున్నారని చెప్పారు. ఇది సరికాదన్నారు. ఏపీలోనూ ఇదే విషయం చర్చకు వచ్చిందన్నారు. 2019లో ఈవీఎంలపైనే వైసీపీ గెలిచిందని.. కానీ, 2024లో ఓడే సరికి.. వాటిని తప్పుబట్టిందన్నారు.
+ సనాతన ధర్మంపై మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది ఇప్పుడు మొదలైంది కాదని.. కొన్ని శతాబ్దాల కిందటే ఉందన్నారు. అసలు మన దేశమే సనాతన ధర్మమని వ్యాఖ్యానించారు. ముస్లింలను కానీ.. క్రిస్టియన్లను కానీ.. హిందువులు టార్గెట్ చేయడం లేదన్న ఆయన.. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిని మాత్రమే ఖండిస్తన్నామని చెప్పారు. తాను సనాతనిగా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పారు.
+ తమిళనాడులోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతారా? అన్న ప్రశ్నకు.. ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏదీ లేదన్న పవన్ కల్యాణ్.. ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని మాత్రంకోరుకుంటున్నట్టు చెప్పారు.
+ నియోజకవర్గాల పునర్విభజన పై స్పందిస్తూ.. నియోజకవర్గాల పునర్విభజనపై తమ వాదన తమకు ఉందన్నారు. దీనిని తాము వెల్లడించామన్నారు. ఇలా జరిగితే.. రాష్ట్రాలకు ఏమీ నష్టం వస్తుందని తాము భావించడం లేదన్నారు.
+ త్రిభాషా సూత్రాన్ని. ముఖ్యంగా హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న కేంద్రంపై విమర్శలపై స్పందించిన పవన్.. ఇది బలవంతంగా రుద్దడం కాదని.. జాతీయ విద్యావిధానాన్ని సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నారని.. జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు పెద్దపీట వేశారని చెప్పారు. కాగా.. పవన్ తమిళంలోనూ.. ఇంగ్లీష్‌లోనూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.