వర్షాలు, వర్షాకాల సమావేశాలతో దేశానికి లాభం.. ప్రధాని మోదీ కవితాత్మక సందేశం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-07-20 08:59 GMT

పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో రుతుపవనాలు అయినా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అయినా సజావుగా చురుకుగా ఉండాలని కోరుకుంటాం, ఆ రెండు ఫలవంతంగా సాగితే ప్రజలకు దేశానికి మంచి జరుగుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దీంతో ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దేశానికి అత్యంత ముఖ్యమైనవని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ సమావేశాలలో అత్యంత కీలకమైన బిల్లులను ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకువస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆదివారం నిర్వహించిన అఖిలపక్షాల సమావేశంలో సభలో 8 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించి విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులు లేకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు జరగనున్న సమావేశాల్లో అత్యంత కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా ఆదాయపు పన్ను సవరణ - 2026 బిల్లుతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, నేషనల్ హానర్ యాక్ట్ 1971కి సవరణ బిల్లు ఉండనున్నాయి. సభ ప్రారంభమైన తొలిరోజే ఈ బిల్లులు చర్చకు రానున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 ఉండగా, కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లులో న్యాయమూర్తుల సంఖ్య 37కి పెంచాలని ప్రతిపాదించారు. వీటితోపాటు జాతీయ గౌరవానికి అవమనాల నివారణ సవరణ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు.

సభలో ప్రవేశపెడుతున్న ఈ బిల్లులకు ప్రతిపక్షాల మద్దతును కోరుతూ ప్రధాని మీడియా ముఖంగా పిలుపునిచ్చారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రుతుపవనాలకు ముడిపెడుతూ ప్రధాని కవితాత్మకంగా చేసిన ప్రకటన ఆకర్షిస్తోంది. వర్షాలు, వర్షాకాల సమావేశాలు రెండూ దేశానికి ఉపయోగమని, ఈ రెండూ దేశ ఉత్పాదకతను పెంచుతాయని మోదీ విశ్లేషించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లులను అడ్డుకోవాలనే వ్యూహంతో ప్రతిపక్షాలు పోరాడుతున్న నేపథ్యంలో ప్రధాని దేశ ప్రజలు అందరికీ అర్థమయ్యేలా వర్షాలతో పార్లమెంటు సమావేశాలను ముడిపెట్టారని, ఆ విధంగా తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని ముందుగానే ఎదురుదాడి చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రతిపక్షాల తర్జనభర్జన

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాల వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశాల్లో 2/3 వంతు మెజార్టీతో కీలక బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా, ప్రతిపక్షాల మధ్య అనైతికతతో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ మినహా మిగిలిన ప్రధాన పార్టీలు అంతర్గత సమస్యలతో అల్లాడుతున్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, శివసేన యూబీటీ పార్టీల్లో తిరుగుబాటు ఆయా పార్టీలను బలహీనం చేశాయి. ఇక కాంగ్రెస్ తో విభేదిస్తున్న డీఎంకే ప్రభుత్వ అనుకూల వైఖరి తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో సభలో నీట్ పేపరు లీక్, అయోధ్య రామమందిర విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు బలం తగ్గినట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయినప్పటికీ ప్రతిపక్షం బలంగా పోరాడేందుకు సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. మొత్తానికి తాజా పరిస్థితులను గమనిస్తే వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగే పరిస్థితి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News