వర్క్ ఫ్రం హోం వద్దన్నందుకు 600 మంది రిజైన్.. ఆ సంస్థలో ఏం జరుగుతోంది.?
హాలీవుడ్‌లోనే కాదు.. కార్పొరేట్ ప్రపంచంలో కూడా ఇప్పుడు పెద్ద చర్చ పారామౌంట్ గ్లోబల్ కొత్త సీఈఓ డేవిడ్ ఎల్లిసన్ తీసుకున్న ‘ఐదు రోజుల ఆఫీస్ రూల్’.;
హాలీవుడ్‌లోనే కాదు.. కార్పొరేట్ ప్రపంచంలో కూడా ఇప్పుడు పెద్ద చర్చ పారామౌంట్ గ్లోబల్ కొత్త సీఈఓ డేవిడ్ ఎల్లిసన్ తీసుకున్న ‘ఐదు రోజుల ఆఫీస్ రూల్’. స్కైడాన్స్‌తో విలీన ప్రకటన తర్వాత ఎల్లిసన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సంస్థలో అంతర్గత ప్రకంపనలు రేపింది. ‘ఇకపై ప్రతి ఉద్యోగి వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలి’ అని సీఈఓ ఆదేశించగానే.. పారామౌంట్ ఆఫీసుల్లో కలకలం రేగింది. వర్క్ ఫ్రం హోమ్ కు అలవాటు పడ్డ సిబ్బంది ఈ ఆదేశాన్ని వార్నింగ్ గా భావించారు.
కొన్ని గంటల్లోనే 600 మంది రిజైన్..
ఈ ఆదేశం వెలువడిన కొన్ని గంటల్లోనే సంస్థలోని మధ్యస్థాయి ఉద్యోగులు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే దిగువన పనిచేస్తున్న దాదాపు 600 మంది ఉద్యోగులు రాజీనామాలు సమర్పించారు. ‘బలవంతపు హాజరు’ విధానానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎల్లిసన్ మాత్రం తన నిర్ణయంపై నిలబడ్డాడు. ‘క్రియేటివిటీ, కలబోసం, ఇన్నోవేషన్ ఇవన్నీ ఆఫీసులోనే పుడతాయి. మనం మళ్లీ ముఖాముఖి కలుసుకోవాల్సిన సమయం వచ్చింది’ అని ఆయన ఒక అంతర్గత ఈమెయిల్‌లో రాశారు.
కొవిడ్ తర్వాత వర్క్ కల్చర్ లో మార్పు..
కొవిడ్ తర్వాత వర్క్ కల్చర్‌లో వచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇది పూర్తి విరుద్ధమైన అడుగు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు ‘హైబ్రిడ్ మోడల్’ వైపు వెళ్తుండగా.., పారామౌంట్ మాత్రం ఆఫీస్ ప్రెజెన్స్‌పై దృష్టి పెట్టడం ఒక రిస్క్ అని నిపుణులు భావించారు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీల్లో సృజనాత్మక వాతావరణం ఎక్కువగా స్వేచ్ఛా ధోరణితో నడుస్తుంది. స్క్రిప్ట్ రైటర్లు, ఎడిటర్లు, మార్కెటింగ్ బృందాలు ఇంటి నుంచి పనిచేయడమే ఎక్కువ సమర్థత చూపించిందని మూడు సంవత్సరాల గణాంకాలు నిరూపించాయి.
భిన్నంగా ఆలోచించిన ఎల్లిసన్..
ఎల్లిసన్ దృష్టిలో విషయం భిన్నంగా ఉంది. ఆయన అనుసరిస్తున్నది ‘ఒకే బృందం.. ఒకే ప్రదేశం’ అనే సిద్ధాంతం. విలీనం అనంతరం స్కైడాన్స్, పారామౌంట్ టీమ్‌లను ఒకే దిశలో నడిపించాలంటే భౌతిక హాజరే పరిష్కారం అని ఆయన భావించారు. ‘వర్క్ ఫ్రం హోమ్’ అనే సౌకర్యం సిబ్బంది నిబద్ధతను తగ్గించిందని, వ్యక్తిగత ప్రొడక్షన్ కంటే బృందం ప్రొడక్షన్ ముఖ్యమని వ్యాఖ్యానించారు. కానీ ఈ తర్కం అందరికీ సరిపోలేదు. పారామౌంట్ క్రియేటివ్ విభాగంలో పనిచేసే పలువురు ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని ‘ఆలోచించని ఆదేశం’గా వ్యాఖ్యానిస్తూ, సీఈఓ దృష్టిలో ఉద్యోగులకు విలువ లేదంటూ అనుకున్నారు. ‘హాలీవుడ్ ఉద్యోగులు ఒక్కో ప్రాజెక్ట్ కోసం సంవత్సరాలుగా రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. ఇప్పుడు వారిని బలవంతంగా ఆఫీసుకు తిప్పడం మానసిక అలసటను పెంచుతుంది’ అని ఒక సీనియర్ ప్రొడ్యూసర్ వ్యాఖ్యానించారు.
కొత్త నిర్ణయం వైపు సీఈఓ
తన నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎల్లిసన్ ఇప్పుడు కొత్త వ్యూహంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఫుల్ బై అవుట్’ ఆఫర్ రూపంలో ఆఫీస్ విధానం నచ్చని ఉద్యోగులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోవడానికి అవకాశం ఇచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. 48 గంటల్లోనే పారామౌంట్ ప్రధాన విభాగాలు మార్కెటింగ్, కంటెంట్, డిజిటల్ మీడియా గణనీయమైన సిబ్బందిని కోల్పోయినట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
వర్క్ కల్చర్ మారుతోందా..?
ఇది కేవలం ఒక సంస్థలో సిబ్బంది తిరుగుబాటు కాదు. ఇది కొవిడ్ తర్వాతి ప్రపంచంలో ‘వర్క్ కల్చర్’ ఎటు వెళ్తుందో చూపించే సంకేతం. సౌకర్యం, సమర్థత, మానసిక సమతుల్యత వంటి అంశాల మధ్య కార్పొరేట్ ప్రపంచం ఒక కొత్త సమీకరణ దశలోకి అడుగుపెడుతోంది. కానీ డేవిడ్ ఎల్లిసన్ వంటి సీఈఓలు మాత్రం పాత పద్దతులను మళ్లీ తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఒకటే ప్రశ్న.. ‘వర్క్ ఫ్రం హోమ్ అనేది ఒక సౌకర్యమా? లేక ఆధునిక వర్క్ కల్చర్ లో భాగమా?’ అని. పారామౌంట్ ఘటన మనకు ఏం చెప్తుంది. 21వ శతాబ్దపు ఉద్యోగి కేవలం వేతనం కోసం కాదు, స్వతంత్రంగా ఉండాలని పనిచేస్తాడు.