అర్ధరాత్రి యువతిపై లైంగిక వేధింపులు.. దుమారం రేపిన హోంమంత్రి కామెంట్స్
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై జరుగుతున్న వేధింపులు ఆగడం లేదు.;
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై జరుగుతున్న వేధింపులు ఆగడం లేదు. కామాంధులు ఆడవారు కనిపిస్తే చాలు హీనంగా ప్రవర్తిస్తూ తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఇలాంటి నీచులు తమ ప్రవర్తన మార్చుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా బెంగళూరులోని సుద్దగుంటెపాల్య ప్రాంతంలో జరిగిన ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులు రాత్రి సమయంలో ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఒక ఆగంతకుడు వారిలో ఒక అమ్మాయిని పక్కకు లాగి ఆమె ప్రైవేటు భాగాలను తాకి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఊహించని సంఘటనతో ఆ యువతులు భయంతో వణికిపోయారు. వెంటనే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పెద్ద నగరాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మహిళలే కాస్త జాగ్రత్తగా ఉండాలన్నట్లుగా ఆయన మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు, పెట్రోలింగ్ పెంచాలని, ఆకతాయిలపై కేసులు నమోదు చేయాలని కూడా చెప్పినట్లు తెలిపారు.
హోంమంత్రి పరమేశ్వర చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక హోంమంత్రి అయి ఉండి ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాల్సిన హోంమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హోంమంత్రి పరమేశ్వర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మహిళలపై జరుగుతున్న దాడులను సమర్థించేలా లేదా వాటిని తేలికగా తీసుకునేలా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హోంమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మహిళల భద్రతకు భరోసా కల్పించేలా మాట్లాడాలే తప్ప ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై హోంమంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.