ఎర్రవల్లిలో ప్రమాదం.. కేసీఆర్ ఇంట్లో జారిపడిన ఎమ్మెల్యే

తెలంగాణ రాజకీయ వర్గాల్లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తూ జారి పడ్డారు.;

Update: 2025-06-11 08:00 GMT

తెలంగాణ రాజకీయ వర్గాల్లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తూ జారి పడ్డారు. ఈ ఘటనలో ఆయన తుంటి ఎముకకు గాయమైందని సమాచారం. వెంటనే సహచర నాయకులు, కార్యకర్తలు ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

ఈ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణలో హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆయనను కలవడానికి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కి చేరుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కేసీఆర్‌తో పాటు విచారణకు వెళ్లే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. అయితే ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో జారి కింద పడిన ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యవర్గాలు తెలియజేశాయి. ఆయనకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుతున్నాయని సమాచారం.

ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న విచారణ కోసం మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్‌ వైపు బయల్దేరారు. ఆయనతో పాటు 9 మంది నేతలకు విచారణలో పాల్గొనే అనుమతి ఉంది. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లు కేసీఆర్‌తో పాటు విచారణకు హాజరవుతున్నారు.

ఈ ప్రమాదం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.

విచారణ ముగిసిన వెంటనే కేసీఆర్ నేరుగా యశోదా ఆసుపత్రికి వెళ్లారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తుంటి ఎముకకు గాయమైంది. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లాను కేసీఆర్ పరామర్శించారు.

Tags:    

Similar News