పాక్ పనికి భారత విమానయాన సంస్థలకు నెలకు ఎంత నష్టమంటే?
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాక్ దేశాల మధ్య నడుమ మొదలైన ఉద్రిక్తతలు కాస్తా ఆంక్షలుగా మారటం.. ఎవరికి వారుగా చర్యలు చేపడుతున్న వైనం తెలిసిందే.;
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాక్ దేశాల మధ్య నడుమ మొదలైన ఉద్రిక్తతలు కాస్తా ఆంక్షలుగా మారటం.. ఎవరికి వారుగా చర్యలు చేపడుతున్న వైనం తెలిసిందే. భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం రద్దుతో సహా పలు ఆంక్షలు.. బహిష్కరణల నిర్ణయాల్ని తీసుకుంటే అందుకు బదులుగా పాక్ సైతం కొన్ని చర్యలు తీసుకుంది. ఇందులో ముఖ్యమైనది భారత విమానాలు పాకిస్తాన్ గగనతలం మీద విహరించకుండా ఆంక్షలు పెట్టింది. ఈ నిర్ణయం భారత విమానయాన సంస్థల మీద భారీ భారం పడుతోంది.
భారత్ నుంచి పలు ప్రాశ్చాత్య దేశాలకు ప్రయాణం కావటానికి పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తే ప్రయాణ సమయంతో పాటు.. దూరం కూడా కలిసి వస్తుంది. ఎయిర్ స్పేస్ మూసివేత కారణంగా భారత విమానయాన సంస్థల మీద భారీ భారం పడునుంది. ఒక అంచనా ప్రకారం ప్రతి నెలా రూ.307 కోట్ల మేర అదనపు భారం పడుతుందని లెక్క కట్టారు. పాక్ గగనతలానికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గాల్ని ఎంచుకోవటం కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులున్న సంస్థల మీద భారం పడుతోంది.
ఉత్తర అమెరికా వెళ్లే విమానాలకు పాక్ గగనతలం మూసివేత కారణంగా 16 గంటల ప్రయాణ సమయానికి అదనంగా మరో గంటన్నర టైం ఎక్కువ కానుంది. అదే సమయంలో యూరప్ నకు తొమ్మిది గంటల ప్రయాణానికి అదనంగా మరో గంటన్నర సమయం అదనంగా తీసుకునే పరిస్థితి. అదే మధ్యప్రాచ్యానికి విమాన సర్వీసులు నడిపే సంస్థలకు అదనంగా 45 నిమిషాల ప్రయాణ సమయం పట్టనుంది.
ఈ అదనపు గంటన్నర సమయానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.29 లక్షలుగా చెబుతున్నారు. ఈ ఖర్చునకు ల్యాండింగ్..పార్కింగ్ ఫీజులు అదనమన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే విధంగా 45 నిమిషాల అదనపు ప్రయాణ సమయానికి దాదాపు రూ.5 లక్షల అదనపు ఖర్చు పడుతుందని చెబుతున్నారు. ఈ భారం విమాన సంస్థలకు ఇబ్బందికరంగా మారి.. ఆ భారాన్ని ప్రయాణికుల మీద విమానయాన సంస్థలు మోపుతాయన్నది మర్చిపోకూడదు. మొత్తంగా పాక్ తన గగనతలాన్ని మూసివేయటం విమానయాన సంస్థలకు కొత్త కష్టాల్ని తెచ్చి పెట్టిందన్న మాట వినిపిస్తోంది.