అస‌దుద్దీన్ కోట‌లోనూ బీజేపీ పాగా.. 7 నుంచి ఒక‌టికి!

అస‌దుద్దీన్ ఓవైసీ. హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత‌, ఎంపీ. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చూపిస్తాన‌ని చెప్పిన మైనారిటీ నాయ‌కుడు.;

Update: 2025-11-15 12:09 GMT

అస‌దుద్దీన్ ఓవైసీ. హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత‌, ఎంపీ. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చూపిస్తాన‌ని చెప్పిన మైనారిటీ నాయ‌కుడు. నిజంగానే ఆయ‌న 2020లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి 7 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ముఖ్యంగా పూర్వాంచ‌ల్ ప్రాంతంలోని మైనారిటీ ప్రాబ‌ల్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అక్క‌డే కాదు.. మ‌రిన్ని ప్రాంతాల్లోనూ ఎంఐఎంకు బ‌ల‌మైన ఓటు బ్యాంకును కూడా సంపాయించుకున్నారు.

మైనారిటీల హ‌క్కులు.. వారి భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ వంటి కీల‌క అంశాల‌ను అస్త్రాలుగా చేసుకుని మైనారిటీ ముస్లింల‌ను ఆక‌ట్టుకున్న ఎంఐఎం.. ఈ సారి మాత్రం దిగిరాక త‌ప్ప‌లేదు. ఎన్డీయే వైపు ప్ర‌చండ వేగంతో వీచిన బీహారీల ఓటు గాలి దెబ్బ‌కు ఎంఐఎం గాలిప‌టం(ఎన్నిక‌ల గుర్తు) దిక్కుకో దిక్కుగా ఎగిరిపోయింది. ఈ ద‌ఫా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎంఐంఎ 61 స్థానాల్లో ఒంట‌రి పోరు చేసింది. ఒక‌టి రెండు స్థానాల్లో యాద‌వుల‌కు, కుర్మీల‌కు కూడా అస‌దుద్దీన్ అవ‌కాశం ఇచ్చారు.

నిజానికి పోటీ ఎలా ఉన్నా.. ఎంత సెగ‌త‌గిలినా.. ఎంఐఎంకు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న నేప‌థ్యంలో 5-7 స్థానాలు ఖాయ‌మ‌ని అనుకున్నారు. ఎందుకంటే.. గ‌త అసెంబ్లీలో ద‌క్కించుకున్న సీట్ల‌యినా.. ద‌క్కుతాయ‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యం.. ఎన్డీయే దూకుడు.. ముందు గాలిప‌టం నిల‌వ‌లేక పోయింది. 61 స్థానాల్లో పోటీ చేసి కేవ‌లం 1 స్థానాన్ని మాత్ర‌మే నిల‌బెట్టుకుంది. నిజానికి ఇత‌ర పార్టీల‌తో పోలిస్తే.. ఇది చాలా గొప్ప విజ‌య‌మేన‌ని చెప్పాలి.

అయితే.. సిట్టింగ్ స్థానాలు 6 చోట్ల బీజేపీ-జేడీయూ మిత్ర ప‌క్షాల స‌భ్యులు పాగా వేశారు. ఎంఐఎం ఒకే ఒక్క‌స్థానం కొచ్చ‌థామ‌న్‌లో విజ‌యం ద‌క్కించుకుంది. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన శ‌ర్వార్ ఆలం అతి క‌ష్టం మీద విజ‌యం ద‌క్కించుకున్నారు. మొత్తానికి జోకిహాత్‌, బ‌హదూర్ గంజ్, ఠాకూర్‌గంజ్‌, ఆమోర్‌, బైసీల‌లో విజ‌యం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేసిన అస‌దుద్దీన్‌.. ఒక్క‌స్థాన‌మే ద‌క్క‌డంతో పార్టీ కార్యాల‌యానికి వెళ్లిపోయారు.

ఊహించ‌ని ప‌రాజ‌యం!

+ ఇక‌, కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించ‌ని విధంగా సిట్టింగు స్థానాలు కోల్పోయింది. గ‌తంలో 19 చోట్ల విజ‌యం ద‌క్కించుకున్న పార్టీ ఇప్పుడు 4 స్థానాల‌కు ప‌రిమితం అయింది.

+ ఏకంగా 2020లో 49 స్థానాలు ద‌క్కించుకుని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న ఆర్జేడీ తాజా ఎన్నికల్లో 26కు కుదేలైంది.

+ 10 స్థానాల్లో 2020లో విజ‌యం ద‌క్కించుకుని కాల‌ర్ ఎగ‌రేసిన సీపీఐఎంఎల్‌.. తాజాగా 2 చోట్ల‌కే ప‌రిమిత‌మైంది.

+ గ‌త 2020 ఎన్నిక‌ల్లో 2 చోట్ల గెలుపు గుర్రం ఎక్కిన సీపీఐ.. తాజా ఎన్నిక‌ల్లో జీరో స్థాయికి చేరింది.

+ ఎన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌తో పార్టీ పెట్టుకుని వ‌చ్చిన జ‌న్ సురాజ్ పార్టీ(ప్ర‌శాంత్ కిషోర్‌) ఎక్కడా బోణీ కొట్ట‌లేదు స‌రిక‌దా.. డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయింది.

Tags:    

Similar News