ఢిల్లీ వర్సెస్ ఏపీ... రాజకీయం తేడా లేదే..!
నాయకులు చేతులు కలుపుతున్నారు. పార్టీలు కూటములు కడుతున్నాయి.;
రాజకీయాలు హీటెక్కాయి. నాయకులు చేతులు కలుపుతున్నారు. పార్టీలు కూటములు కడుతున్నాయి. అటు ఢిల్లీ, ఇటు ఏపీ.. పెద్దగా తేడా అయితే లేదు. మరి ఏం జరుగుతుంది? అనేది చూడాలంటే 2024 వరకు వెయిట్ చేయడమే. కానీ, ఇప్పుడు జరుగుతున్న చర్చ మాత్రం ఢిల్లీ వర్సెస్ ఏపీపైనే. ఎందుకంటే.. ఢిల్లీలో ని మోడీ సర్కారును కూల్చేసేందుకు.. కాంగ్రెస్ సహా 26 పక్షాలు చేతులు కలిపాయి. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యాయి.
మూడో సారి భేటీకి కూడా ముహూర్తం(ముంబై) పెట్టుకున్నాయి. అంటే.. ఇక్కడ ఉమ్మడి విపక్షాల ఏకైక టార్గట్ మోడీనే. ఆయనను ఓడించడమే ధ్యేయంగా అన్ని పార్టీలూ చేతులు కలిపాయి. కట్ చేస్తే.. ఇంత దూకుడు లేకపోయినా.. ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ఒకే ఒక్కడు సీఎం జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలు కూటములు కట్టేందుకు తెరచాటున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు.
అంటే.. అక్కడ మోడీ కోసం.. ఇక్కడ జగన్ కోసం ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. నిజానికి ఈ రెండు విషయాల్లో కొంత వ్యత్యాసం ఉన్నా.. రాజకీయ కోణంలో చూస్తే మాత్రం కార్యాకారణ సంబంధం అయితే కనిపిస్తోంది. అటు మోడీ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న వ్యవహారం వివాదం అయింది. ఈడీ, సీబీఐ వంటివాటిని ఆయన ఆడిస్తున్నారని, తమ ఉనికికి ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న పార్టీలు.. చేరువ అయ్యాయి. చేతులు కలిపాయి.
ఇటు ఏపీలోనూ తమపై విరుచుకుపడుతున్నారనే కారణంగా వైసీపీ ప్రభుత్వాన్ని తుడిచి పెట్టేయాలనే ది టీడీపీ, జనసేన వ్యూహం. దీనికి బీజేపీని కూడా కలుపుకొని పోతే.. తమకు తిరుగులేదని భావిస్తున్నా యి. అంటే.. మొత్తంగా ఢిల్లీలో జరుగుతున్నరాజకీయానికి, ఏపీలో జరుగుతున్న రాజకీయానికి పెద్దగా తేడా అయితే.. కనిపించడం లేదు. అయితే.. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల సస్పెన్స్‌గా మారింది.