చిన రాజప్పతో ముద్రగడ భేటీ...రాజకీయ సంచలనమేనా ?
ఈ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుగా ఉన్నా రెండు పార్టీలకు చెందిన నేతలుగా ఉన్నారు. ఏపీలో చూస్తే వైసీపీ టీడీపీల మధ్య అగ్గి రాజుకున్న పరిస్థితి ఉంది.;
ముద్రగడ పద్మనాభం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. నిమ్మకాయల చినరాజప్ప గత టీడీపీ హయాంలో హోం మంత్రిగా ఉన్నారు. 2019లో వైసీపీ వేవ్ ని సైతం తట్టుకుని గెలిచారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ గెలిచినా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు. మంత్రి పదవులు ఏవీ దక్కలేదు. ఇదిలా ఉంటే ముద్రగడ ఆదివారం నేరుగా నిమ్మకాయల చినరాజప్ప ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ కావడం రాజకీయంగా సంచలనం అయింది.
రెండు పార్టీల నేతలుగా :
ఈ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుగా ఉన్నా రెండు పార్టీలకు చెందిన నేతలుగా ఉన్నారు. ఏపీలో చూస్తే వైసీపీ టీడీపీల మధ్య అగ్గి రాజుకున్న పరిస్థితి ఉంది. దాంతో ఎవరితో ఎవరు కలవాలని అనుకున్నా ఇబ్బందిగా మారుతోంది. గతంలో మాదిరిగా ఇతర పార్టీల నేతల ఇళ్లకు వెళ్ళి మాట్లాడుకోవడం మంతనాలు చేయడాలూ పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో దాంతో ముద్రగడ వంటి ఒక కీలక నేత నేరుగా టీడీపీ కీలక నేతను కలవడాన్ని అంతా తలో విధంగా చూస్తున్నారు అని అంటున్నారు.
మ్యాటర్ ఇదేనా :
అయితే ఈ భేటీ స్నేహపూర్వకమైనదిగానే చెబుతున్నారు గత ఏడాది ముద్రగడ తీవ్ర అస్వస్తతకు గురి అయి ఆసుపత్రి పాలు అయ్యారు. ఆ సమయంలో ఆయనను చూడడానికి ఆసుపత్రికి నిమ్మకాయల చినరాజప్ప వెళ్లారు, అయితే వైద్యుల సూచనల మేరకు ఆయనను చూడకుండానే వెనక్కి వచ్చేశారు. అయితే తనను చూడాలని వచ్చిన నిమ్మకాయల చినరాజప్పను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి ఆరోగ్యం కుదుటపడిన తరువాత ముద్రగడ తానే వెళ్ళి కలవాలని అనుకున్నారు. అయితే అది ఇన్నాళ్ళకు వీలు పడింది అని అంటున్నారు. దాంతో ఇది కేవలం ఒక సాధారణ భేటీగానే చూస్తున్నారు.
కూటమిని ఓడించేందుకు :
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ముద్రగడ కూటమిని ఓడించందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యే కానీయను అని శపధం పట్టారు. అక్కడ వైసీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న వంగా గీతకు ప్రచారం చేసారు. ఒకవేళ వైసీపీ ఓడిపోతే తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని కూడా చెప్పి మరీ ఆ విధంగానే చేశారు. మొత్తానికి కూటమికి గట్టి ప్రత్యర్ధిగా ఉన్న ముద్రగడ టీడీపీ సీనియర్ నేత మాజీ హోం మంత్రిని కలవడం అంటే రాజకీయంగా విశేషం అనే చెబుతున్నారు.
పార్టీ బలోపేతానికి :
ఇంకో వైపు చూస్తే గోదావరి జిల్లాలలో వైసీపీని బలోపేతం చేసే బాధ్యతలను ముద్రగడకు జగన్ అప్పగించారు. ఈ మధ్యనే తాడేపల్లికి వెళ్ళిన ముద్రగడ ఆయన కుమారుడు గిరితో జగన్ ఇదే విషయం మీద చర్చించారు అని ప్రచారం సాగింది. పైగా ముద్రగడ ఈ మధ్య ఆరోగ్య పరంగా కోలుకుని మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్ అవుతున్నారు. దాంతో పాటుగా కూటమి పాలనకు రెండేళ్ళ సమయం పూర్తి అవుతున్నందువల్ల ప్రజా వ్యతిరేకత నెమ్మదిగా వస్తోంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆ పనిలో చురుకుగా ఉన్న ముద్రగడ మధ్యలో నిమ్మకాయలను కలవడం మీదనే చర్చ సాగుతోంది. మరి ఈ స్నేహపూర్వకమైన భేటీ అయితే రాజకీయంగా వైరల్ అవుతోంది.