‘సిగ్గు, ల*జ్జ ఉన్నవారు వైసీపీ వారితో మాట్లాడరు’.. చింతకాయల విజయ్ తీవ్ర వ్యాఖ్యలు
స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐటీడీపీ కో-కన్వీనర్ చింతకాయల విజయ్ సొంత పార్టీ కార్యకర్తలపై భగ్గుమన్నారు.;
స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐటీడీపీ కో-కన్వీనర్ చింతకాయల విజయ్ సొంత పార్టీ కార్యకర్తలపై భగ్గుమన్నారు. విపక్షం వైసీపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారంటూ కొందరు కార్యకర్తలపై విజయ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తమను అన్నివిధాలుగా ఇబ్బందులు పెట్టారని, అవి మరచిపోయి రాజకీయం కోసం ఇప్పుడు వారితో మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి కార్యకర్తలపై పరుష వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో విజయ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ప్రస్తుతం అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే మిత్రపక్షం బీజేపీకి ఆ స్థానం కేటాయించడంతో విజయ్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక సొంత నియోజకవర్గం నర్సీపట్నంలో పార్టీ కార్యక్రమాలు అన్నీ విజయ్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటంతో నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు అన్నీ విజయ్ పర్యవేక్షిస్తున్నారు.
ఇక తాజాగా ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ‘‘సిగ్గు, లజ్జ లేకుండా వైసీపీ వాళ్లతో మాట్లాడుతున్నారు’’ అంటే ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ మానవత్వం ఉంటే వైసీపీ వారితో మాట్లాడరని స్పష్టం చేశారు. ‘‘గతంలో పక్కపార్టీ వారితో మాట్లాడేవారమని, వారి పెళ్లిళ్లు, వేడుకలకు వెళ్లేవారమని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో వైసీపీ వారు మనల్ని అన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎఫ్ఐఆర్లు వేశారు, కేసులు పెట్టారు, ఆడవాళ్లని సైతం రోడ్డుపైకి లాగారు. అలాంటి వారితో ఎలా మాట్లాడతారు. నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఇంకోసారి అలా మాట్లాడే వారిని వంగో బెట్టి తన్నేస్తా’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘మీ అందరికీ ఒకటే చెబుతున్నా, నిజంగా మగతనంతో రాజకీయం చేయాలి. రాజకీయాల కోసం అన్నీ మరచిపోతామా? నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఎవడెవడు మాట్లాడుతున్నాడు. ఆ ఊరు పోయినా, పంచాయతీ పోయినా ఫర్వాలేదు.. కానీ ఒకటే చెబుతున్నా వెన్నుపోటు పొడిచేవాడిని క్షమించేది లేదు. వెన్నుపోటు పొడిచేవాడి పేగులు తీసి రోడ్డుపై పడేస్తా. నా రక్త సంబంధీకులు అయినా ఫర్వాలేదు. వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు.’’ అంటూ విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయం కోసం ఏ ఒక్కరూ వైసీపీ వారితో సంబంధాలు పెట్టుకోవద్దంటూ విజయ్ స్పష్టం చేశారు. గెలవకపోయినా పర్వాలేదని, రాజకీయాల్లో ఓటమి కూడా ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.
తనకు గెలుపు కన్నా పార్టీ ముఖ్యమని విజయ్ వ్యాఖ్యానించారు. నాకు సీటు ఇవ్వలేదు. అలాగని పార్టీ మారలేదు. నాన్న చెప్పినట్లే చెబుతున్నా.. చచ్చే వరకు నాది ఇదే పార్టీ అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఆరేళ్ల నుంచి చెబుతున్నా, ఎవరూ నమ్మడం లేదు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని మాట్లాడేస్తారా? ఏంటీ రాజకీయం. చీరకట్టుకుని ఇంట్లో ఉండిపోండి. ఓడిపోతే పోతాం.. ఓడిపోవడం సహజం, ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోవద్దు. మీరు మంచిపని చేస్తున్నారా? లేదా? అని ఆత్మ విమర్శ చేసుకోండంటూ కార్యకర్తలకు హితవు పలికారు. ఈ మధ్య కొందరిని పార్టీలోకి తీసుకున్నాం, వారెవరూ గతంలో మనకు వెన్నుపోటు పొడవలేదు. వెన్నుపోటు పొడిస్తే పది వేల ఓట్లు ఉన్నా దగ్గరకు రానీయం అంటూ తేల్చిచెప్పారు. ఇక తాను రాజకీయాలను ఏమోషన్ గా తీసుకుంటున్నానని అంటున్నారని, నిజంగానే తనకు రాజకీయం ఏమోషనే, మంత్రి నారా లోకేశ్ దారిలోనే నేను రాజకీయాన్ని ఏమోషన్ తో చూస్తున్నా అంటూ టీడీపీ యువనేత విజయ్ కుండబద్దలు కొట్టారు.