భర్త గలీజ్ బంధాన్ని గుట్టు రట్టు చేసిన భార్యకు చైనా కోర్టు షాకింగ్ శిక్ష

ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె తన భర్త తప్పుడు పనుల గురించి వివరిస్తూ.. అతడి బండారాన్ని బయటపెట్టింది. తన భర్త పని చేసే ఆఫీసు వివరాలతో పాటు.. భర్తను తిడుతూ పోస్టులు పెట్టింది.;

Update: 2026-01-25 13:30 GMT

భర్త పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి సోషల్ మీడియాలో విమర్శలు చేసినందుకు ఆ ఇల్లాలికి ఊహించని షాక్ ఎదురైంది. ఆమె చేసిన పనిని తప్పు పట్టిన కోర్టు.. ఆమెకు వింత శిక్ష వేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సదరు కోర్టు విధించిన శిక్ష ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. వాదనలు మొదలయ్యాయి. ఇంతలా అందరిని ప్రభావితం చేసిన సదరు కోర్టు ఏ దేశానికి చెందిందంటే.. మన పొరుగున ఉండే చైనా. ఆ దేశంలోని ఒక కోర్టు విధించిన శిక్ష ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేయటమే కాదు.. సోషల్ మీడియాలో సదరు భార్య వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్ కు చెందిన నియు నా అనే మహిళకు గావో ఫీ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. గావో ఫీ ఒక బొగ్గు గని కంపెనీలో టీమ్ లీడ్ స్థానంలో ఉన్నాడు. అతనికి ఆఫీసులోని మరో వివాహితతో వివాహేతర సంబంధం మొదలైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న భార్య.. భర్తతో విబేధించింది. దీంతో.. వీరిద్దరి మధ్య ఈ విషయంలో గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె తన భర్త తప్పుడు పనుల గురించి వివరిస్తూ.. అతడి బండారాన్ని బయటపెట్టింది. తన భర్త పని చేసే ఆఫీసు వివరాలతో పాటు.. భర్తను తిడుతూ పోస్టులు పెట్టింది. ఈ నేపథ్యంలో తన భార్యపై భర్త గావో ఫీ పరువునష్టం కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. అనూహ్య రీతిలో తీర్పు ఇవ్వటం గమనార్హం.

ఒకరు వ్యక్తిగతంగా ఎన్ని తప్పులు చేసినా.. చట్టం ప్రకారం అతడి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించే హక్కుఎవరికి ఉండదని స్పష్టం చేసిన కోర్టు.. తన భర్తకు సదరు మహిళ పదిహేను రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. దీంతో.. జనవరి 12 నుంచి భర్తను క్షమించమని కోరుతూ వరుసగా క్షమాపణలు చెబుతూ పోస్టులు పెట్టటం మొదలుపెట్టింది.

కోర్టు ఆదేశాల్ని అమలు చేస్తూనే.. తన భర్తకు వ్యంగ్య రీతిలో సారీ చెబుతోంది. అంతేకాదు.. తనే భర్తతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న మహిళకు సైతం వ్యంగ్య రీతిలో చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. మీ ఇద్దరిది నిజమైన ప్రేమ అని పేర్కొంటూ.. ‘‘నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ గౌరవాన్ని నేను కాపాడాలి కాబట్టి నన్ను క్షమించు’’ అంటూ తనదైన రీతిలో సారీ చెప్పటం మొదలు పెట్టింది. దీంతో.. ఆమె వీడియోలువైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఈ వింత తీర్పుతో సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ అయిపోయారు. రోజుల వ్యవధిలోనే ఆమెకు 3.5 లక్షల మంది ఫాలోవర్లు పెరగటం గమనార్హం.

Tags:    

Similar News