అనంతపురం జిల్లాకు ఏమైంది? 3 రోజులుగా కాకులు.. పావురాలు చనిపోతున్నాయి
ఈ వరుస ఉదంతాలతో సామాన్యులు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీక్రిష్ణ దేవరాయల విశ్వవిద్యాలయం వ్రక్ష.. జంతుశాస్త్ర విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు స్పందిస్తున్నారు.;
అనూహ్యంగా చోటు చేసుకుంటున్న ఉదంతాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయో అర్థం కాక సామాన్యులు తల పట్టుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనల్ని తాము చూడలేదని చెబుతున్నారు. ఏపీలోని అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పావురాలు.. కాకులు ఇట్టే కిందకు పడి చనిపోతున్నాయి. అప్పటివరకు బాగున్నట్లే బాగుండి.. ఒక్కసారిగా చెట్ల మీద నుంచి పడి చనిపోతున్న విషాద ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
అనంతపురం జిల్లా శ్రీక్రిష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల నుంచి పదుల సంఖ్యలో పావురాలు.. కాకులు చనిపోతున్న వైనం ఆందోళనకు గురి చేస్తోంది. ఎస్కేయూకు సమీపంలోని వనమిత్ర అటవీ ఉద్యాన పరిసరాల్లో పావురాలు సైతం ఇదే తరహాలో చనిపోతున్నాయి. అకస్మాత్తుగా చెట్ల మీద నుంచి కిందకు పడిపోతున్న వైనం ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ వరుస ఉదంతాలతో సామాన్యులు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీక్రిష్ణ దేవరాయల విశ్వవిద్యాలయం వ్రక్ష.. జంతుశాస్త్ర విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు స్పందిస్తున్నారు. ఏఎన్ఎన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ కారణంగా ఈ పక్షులు చనిపోతున్నట్లుగా చెబుతున్నారు. చనిపోయిన కాకులు.. పావురాల్ని చేతులతో ముట్టుకోవద్దని.. వాటిని తాకితే శ్వాసకోశ.. కళ్లకలక లాంటి సమస్యలు తలెత్తే వీలుందని హెచ్చరిస్తున్నారు.
ఇలా చనిపోయిన పక్షుల్ని నేరుగా తాకకుండా ఏదైనా వస్తువు సాయంతో గుంతలు తీసి.. అందులో పూడ్చేయాలని.. ఆ వస్తువుల్ని మళ్లీ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని చెబుతున్నారు. లేదంటే.. వాటిని దహనం చేయటం కూడా మంచిదేనని సూచన చేస్తున్నారు.