ఆపరేషన్ సింధూర్: పాక్ గుట్టూ - ట్రంప్ గుట్టూ బయటపెట్టినందుకు శిక్ష!
నోరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రభుత్వ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది పాకిస్తాన్ పై భారతదేశ ఆర్మీ సాధించిన విజయానికి సిసలైన గుర్తింపు ఈరోజు దక్కిందని చెప్పొచ్చు. ఓపి సింధూర్ యుద్దంలో పాక్ పై భారత్ గెలుపును పాకిస్తాన్ గడ్డ నుంచి గర్వించదగిన మాజీ ప్రధాన మంత్రి సోదరి రీన్ నియాజీ స్వయంగా ధృవీకరించారు. దీంతో ఆ దేశ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) రీన్ నియాజీకి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా.., సమాజంలో ఉద్రిక్తతలు పెంచేలా సోషల్ మీడియాలో అసత్యమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేశారనే ఆరోపణలపై ఇస్లామాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నోటీసులను ఉల్లంఘిస్తే పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్ 174 ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
పాకిస్థాన్- ఇండియా మధ్య జరిగిన సైనిక ఘర్షణపై నోరీన్ నియాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో ఈ విచారణ ప్రారంభమైంది. పాకిస్థాన్ ఆర్మీ ఇమేజ్‌ను పెంచడానికి `ఆపరేషన్ సింధూర్` యుద్ధాన్ని `స్క్రిప్టెడ్ నాటకం`లా ఆడారని ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. అంతేకాకుండా.... ఇజ్రాయెల్‌ను పాకిస్థాన్ గుర్తించేలా చేసేందుకే ఈ ప్రణాళిక రచించారని... అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాక్ నాయకత్వాన్ని మెచ్చుకోవడం వెనుక కూడా ఇదే అజెండా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నోరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రభుత్వ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రయోజనాల కోసమే నోరీన్ దేశభద్రతను తాకట్టు పెట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను అవమానించేలా ఉన్న ఈ వ్యాఖ్యలకు గానూ నోరీన్ నియాజీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హోంశాఖ సహాయ మంత్రి తలాల్ చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ సైనిక దళాలు దేశ గౌరవానికి ప్రతీక అని, ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని హుకుం జారీ చేసారు.
రెండు దేశాల మధ్య జరిగిన పోరాటంలో పాకిస్థాన్ తన సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుందని.. ఆర్మీ త్యాగాలను తక్కువ చేసి మాట్లాడటం ఏ పౌరుడికీ తగదని మంత్రులు పేర్కొన్నారు. ప్రస్తుత అధికార కూటమి.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన తరుణంలో... ప్రభుత్వ సంస్థలు.. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రచారాలు చేసే వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తుందనడానికి ఈ నోటీసులు ఒక నిదర్శనంగా నిలిచాయి.