భారత్ దాడి చేసిన 9 ఉగ్రస్థావరాల వివారాలివే!
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని హత్యచేసిన సంగతి తెలిసిందే.;
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని హత్యచేసిన సంగతి తెలిసిందే. ఇలా పర్యాటకులపై దాడి చేసిన అనంతరం ఉగ్రమూకలు అక్కడ నుంచి పారిపోయారు. వీరందరి స్థావరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నాయనే విషయం తెలిసిందే! ఈ సమయంలో భారత సైన్యం 9 ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసింది.
ఈ దాడితో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీన్ని పాకిస్థాన్ ‘యుద్ధ చర్య’గా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో.. భారత సైన్యం మెరుపుదాడి చేసిన ఆ 9 ఉగ్రవాద స్థావరాలు ఏమిటి.. అవి ఏయే ఉగ్రవాద సంస్థలకు చెందినవి.. అందులో పాకిస్థాన్ లో ఉన్నవి ఎన్ని, పీవోకేలోవి ఏమి అనే విషయం ఇప్పుడు చూద్దామ్..!
అవును... పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో భాగంగా.. మంగళవారం అర్ధరాత్రి పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై "ఆపరేషన్ సిందూర్" పేరుతో మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100కి.మీ. లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది.
ఈ దాడులో ధ్వంసమైన 9 ఉగ్ర స్థావరాల్లోనూ.. 4 స్థావరాలు పాకిస్థాన్ లోనివి కాగా, మిగిలిన 5 స్థావరాలు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోనివి! ఇందులో లక్షరే తోయిబాకు చెందినవి 3, జైషే మహ్మద్ కు చెందినవి 4 క్యాంపులు ఉండగా.. మిగిలిన రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ శిభిరాలు అని తెలుస్తోంది!
1) మురిద్కేలోని మర్కాజ్ తోయిబా: అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్షరే తోయిబా క్యాంపు కార్యాలయమే ఈ మర్కాజ్ తోయిబా! ముంబైలోని 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నది ఇక్కడే అని చెబుతారు. ఆ దాడుల్లో సుమారు 166 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు.
2) ముజఫరాబాద్ లోని షవాయ్ నల్లాహ్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో ఈ షవాయ్ నల్లాహ్ లక్ష్కరే క్యాంప్ ఉంది. ఇక్కడ 2000 నుంచి కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఇక్కడే లష్కరే తోయిబా ఉగ్రవాదుల నియామకాలు, శిక్షణ వంటివి చేయపడుతున్నారు.
3) బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదిత్: ఇది పూంఛ్ - రాజౌరీ - రియాసీ సెక్టార్ లోని లక్షరే తోయిబా కు చెందిన ఉగ్ర స్థావరం. ఇక్కడ నుంచే నుంచి లక్షరే ఉగ్రవాదులు, ఆయుధాలను పంపించేందుకు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు.
4) బహవల్ పూర్ లోని మర్కజ్ సుబాన్: ఇదే జైషే మహ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయం. కాగా... ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
5) ముజఫరాబాద్ లోని సైద్నా బిలాల్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహ్మద్ ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి కాగా... జమ్మూకశ్మీర్ లోని ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. ముజఫరాబాద్ రెడ్ ఫోర్టుకు ఎదురుగా ఉన్న ఈ స్థావరంలో 50 - 100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం.
6) తెహ్రా కలాన్ లోని సర్జల్: జైషే మహ్మద్ ఉగ్రస్థావరాల్లో ఇది కూడా ఒకటి కాగా... దీన్ని కూడా జమ్మూకశ్మీర్ లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు.
7) సియల్ కోట్ లోని మొహ్మూన్ జోయా: ఇది హిబుల్ ముజాహిద్దీన్ శిబిరం కాగా ఇది అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. దీని చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి.
8) కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్: 20 ఏప్రిల్ 2023 పూంచ్ లో జరిగిన ఉగ్రదాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులపై దాడికి ఉగ్రవాదుల్లు ఇక్కడి నుంచే వచ్చారని చెబుతారు. ఇది నియంత్రణ రేఖ (ఎల్.ఓల్.సీ)కు 35 కి.మీ. దూరంలో ఉంది.
9) కోట్లిలోని మస్కర్ రహీల్ షహీద్: ఇది కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన స్థావరం కాగా.. కొండ ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్ లో నాలుగు గదులు, బరాక్ లు ఉన్నాయని చెబుతారు. ఇక్కడ పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నట్లు చెబుతారు.