పాత ఫోటోలతో చైనా కొ(చె)త్త ఆనందం.. భారత్ సీరియస్!
ఈ సమయంలో.. ఆ దేశానికి మద్దతుగా అన్నట్లుగా చైనా ప్రభుత్వ మీడియా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది.;
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన పాశవిక ఉగ్రదాడికి భారత్ తాజాగా ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆపరేషన్ సింధూర్ ను భారత త్రివిధ దళాలు సంయుక్తంగా, సమన్వయంతో చేపట్టాయి. ఈ సమయంలో పాక్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి.
ఈ దాడిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాయుద్ధీన్ సంస్థలకు చెందిన కీలక నాయకులు మరణించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో పాక్ మాత్రం రకరకాల వెర్షన్స్ తో స్పందిస్తూ.. షాక్ నుంచి ఇంకా తేరుకోలేక కన్ఫ్యూజన్ తో కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తుంది! ఈ సమయం చైనా ఓ తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది.
అవును.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో... సుమారు 80 మంది ఉగ్రవాదులు మరణించగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారని అంటున్నారు. ఈ షాక్ నుంచి పాక్ తేరుకున్నట్లు కనిపించని ఈ సమయంలో.. ఆ దేశానికి మద్దతుగా అన్నట్లుగా చైనా ప్రభుత్వ మీడియా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా.. భారతదేశం ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత పాకిస్థాన్ మూడు భారత యుద్ధ విమానాలను కూల్చివేసిందని చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన పాత ఫోటోలను చూపిస్తుంది! దీంతో... ప్రచారంపై భారత్ సీరియస్ గా స్పందించింది. వాస్తవాలను ధృవీకరించాలని కోరింది.
ఈ రకంగా తప్పుడు సమాచారన్ని బయటకు పంపే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని, మీ మూలాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చైనా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు ఆ దేశంలోని భారతీయ రాయబార కార్యాలయం ఓ ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా ప్రచారం చేస్తున్న పాత ఫోటోలను కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకర్ క్లియర్ చేసింది. ఇందులో ఒకటి సెప్టెంబర్ 2024లో రాజస్థాన్ లో కూలిన భారత వైమానిక దళం మిగ్-29 ఫైటర్ జెట్ కు సంబంధించిన ఫోటో కాగా. మరొకటి 2021లో పంజాబ్ కు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ -21 ఫైటర్ జెట్. వీటిని తాజాగా పాక్ కూల్చినట్లు ప్రచారం చేస్తున్నారు.