అసలేంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్.. ఈ యాక్ట్‌లో ఏముంది?
అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన “ఒన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్” (OBBA) బిల్లు అమెరికాలోని అనేక కీలక రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.;
ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాత చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తూ.. సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్.. 8 గంటల 32 నిమిషాలపాటు మాట్లాడడం విశేషంగా చెప్పొచ్చు.
అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన “ఒన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్” (OBBA) బిల్లు అమెరికాలోని అనేక కీలక రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ఈ బిల్లులోని ప్రధాన అంశాలు ఏంటో తెలుసుకుందాం.
- పన్నులు - ఆర్థిక విధానాలు:
2017 ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్ శాశ్వతంగా అమలు: ట్రంప్ హయాంలో అమలులోకి వచ్చిన పన్ను తగ్గింపులు ఈ బిల్లు ద్వారా శాశ్వతం అవుతాయి, ఇది వ్యాపారాలు, వ్యక్తులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుస్తుంది.
ప్రభుత్వ ఋణ పరిమితి పెంపు: ప్రభుత్వ ఋణ పరిమితిని $5 ట్రిలియన్ల మేర పెంచారు, ఇది ప్రభుత్వ వ్యయాలకు మరింత వెసులుబాటు కల్పిస్తుంది.
ప్రామాణిక డిడక్షన్ - చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ పెంపు: ఒంటరిగా ఫైల్ చేసే వారి కోసం ప్రామాణిక డిడక్షన్ను $750 పెంచి మొత్తం $15,750కి చేర్చారు. అలాగే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను $2,200కి పెంచారు.
వేతనాల పన్ను డిడక్షన్లపై పరిమితులు: టిప్ వేతనాలపై డిడక్షన్ మూడు సంవత్సరాల పాటు $25,000 వరకు, ఓవర్ టైం వేతనంపై డిడక్షన్ $12,500కి పరిమితం చేశారు.
వాహన రుణ వడ్డీ డిడక్షన్: అమెరికాలో తయారైన వాహనాలపై తీసుకున్న రుణాల వడ్డీకి $10,000 వరకు డిడక్షన్ అందుబాటులో ఉంటుంది. ఇది వ్యక్తులకు $100,000 లోపు , దంపతులకు $200,000 లోపు ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుంది.
- సరిహద్దు భద్రత - రక్షణ:
సరిహద్దు భద్రతకు భారీ కేటాయింపు: సరిహద్దు భద్రత కోసం సుమారు $150 బిలియన్ కేటాయించారు. ఇందులో అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి $46.5 బిలియన్, ICE (ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) కోసం $30 బిలియన్ కేటాయించారు.
రక్షణ రంగానికి భారీ పెంపు: రక్షణ వ్యయానికి అదనంగా $153 బిలియన్ కేటాయించారు. ఇందులో “గోల్డెన్ డోమ్” అనే అంతరిక్ష క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం $25 బిలియన్ , నౌకా నిర్మాణాల పెంపుదల కోసం $29 బిలియన్ కేటాయించారు.
- సామాజిక , విద్య రంగం:
మిలియనీర్లకు నిరుద్యోగ భత్యాలను నిలిపివేశారు. మెడికెయిడ్ ద్వారా గ్రామీణ ఆసుపత్రులకు మద్దతునిచ్చారు. గ్రామీణ ఆసుపత్రులకు మెడికెయిడ్ ద్వారా $50 బిలియన్ కేటాయించారు, ఇది ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పని చేయగల వారికి పని తప్పనిసరి కల్పించాలన్నది బిల్లు ఉద్దేశం. ఆరోగ్యంగా ఉన్న వయోజనులు , 15 సంవత్సరాల పైబడిన పిల్లల తల్లిదండ్రులు నెలకు కనీసం 80 గంటలు పని చేయడం తప్పనిసరి. 2024 జనవరి 1 నుండి 2028 డిసెంబర్ 31 మధ్య జన్మించిన పిల్లల తల్లిదండ్రుల కోసం “ట్రంప్ అకౌంట్లు” ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రభుత్వం ప్రారంభంగా $1,000 పెట్టుబడి అందిస్తుంది.
ఫెడరల్ విద్యా రుణాలపై జీవితకాలానికి $257,500 వరకు అప్పుగా లిమిట్ విధించారు. ప్రొఫెషనల్ డిగ్రీలకు సంవత్సరానికి $50,000 , జీవితకాలానికి $200,000, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సంవత్సరానికి $20,500 జీవితకాలానికి $100,000 పరిమితులు ఉంటాయి.
సంపన్న కాలేజీలపై ఎక్సైజ్ ట్యాక్స్ విధించారు. ఎక్కువ సంపత్తి కలిగిన కాలేజీలపై (3,000 మందికి పైగా విద్యార్థులు ఉంటే) 8% ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తారు. తక్కువ సంపత్తి కలిగిన సంస్థలపై 4% లేదా 1.4% వడ్డీ విధిస్తారు.
- గర్భస్రావ వ్యతిరేక నిబంధనలు:
బలమైన గర్భస్రావ వ్యతిరేక నిబంధనలు పొందుపరిచారు. ప్లాన్డ్ పెరెంట్ హుడ్ వంటి పెద్ద గర్భస్రావ సేవల కేంద్రాలకు మెడికెయిడ్ నిధులను నిరాకరించేందుకు కొత్త నిబంధనలు ఈ బిల్లులో చేర్చారు.
ఈ బిల్లులోని విధానాలు కొన్ని వర్గాల ప్రజలకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరికి తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పన్ను తగ్గింపుల, సామాజిక సేవలపై ఖర్చుల కోతలు, గర్భస్రావంపై నియంత్రణలు వంటి అంశాలు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ బిల్లు పై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.