మోడీ నోట పసుపు బోర్డు ప్రకటనతో చెప్పులేసుకున్న రైతు

ప్రధాని మోడీ నోటి నుంచి తాజా ప్రకటన రావటంతో ఆయనకు ఆదివారం సాయంత్రం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద మనోహర్ రెడ్డి చెప్పులు వేసుకున్నారు.

Update: 2023-10-02 04:26 GMT

ఏళ్లకు ఏళ్లుగా పసుపు బోర్డు కోసం పోరాడుతున్న తెలంగాణ పసుపు రైతుల పోరు ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. కీలక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనకు రోజుల్లోకి వచ్చేసిన వేళ.. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. అనూహ్య రీతిలో పసుపు బోర్డును ప్రకటించిన వైనం పసుపు రైతుల్లో సంతోషానికి కారణమైంది. వాస్తవానికి.. 2019 ఎంపీ ఎన్నికలు ముగిసి.. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినంతనే పసుపు బోర్డు తీసుకొస్తానని.. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఎంపీ అర్వింద్ మాట ఇవ్వటం తెలిసిందే. అయినప్పటికీ.. రాలేదు.

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా ప్రధాని మోడీ నోటి నుంచి ప్రకటన వచ్చింది. మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోడీ చేసిన ప్రకటనతో ఒక రైతు తన కాలికి చెప్పులు వేసుకున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు నష్టపోతున్నారని.. మద్దతు ధర వచ్చేందుకువీలుగా రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణలోని పసుపు రైతులు ఎంతో కాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే.

ఈ డిమాండ్ లో భాగంగా.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన పసుపు రైతు ముత్యాల మనోహర్ రెడ్డి డిమాండ్ చేస్తూ.. గడిచిన పన్నెండేళ్లుగా ఆయన చెప్పులు వేసుకోకుండా దీక్ష చేస్తున్నారు. పసుపు బోర్డు డిమాండ్ సాకారం అయ్యే వరకుతాను చెప్పులు వేసుకోనంటూ.. పట్టుబట్టిన ఆయన చెప్పులు ధరించకుండానే ఉన్నారు. ఇందులో భాగంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు ఆర్మూరు నుంచి తిరుపతి వరకు కాలి నడకకన వెళ్లి.. తిరుమల వెంకన్నను వేడుకున్నారు.

ప్రధాని మోడీ నోటి నుంచి తాజా ప్రకటన రావటంతో ఆయనకు ఆదివారం సాయంత్రం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద మనోహర్ రెడ్డి చెప్పులు వేసుకున్నారు. ప్రధాని ప్రకటనతో పసుపు బోర్డు కల తీరిందన్న ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News