బ్యాంకులపై ప్రై వేటు ...ఇందిరమ్మ చేసిన దానికి రివర్స్ !
దేశంలో బ్యాంకులను ప్రభుత్వ రంగంలో కొనసాగించే అవకాశాలు ఇక మీదట లేవా అంటే జవాబు అవును అనే అనిపిస్తోంది.;
దేశంలో బ్యాంకులను ప్రభుత్వ రంగంలో కొనసాగించే అవకాశాలు ఇక మీదట లేవా అంటే జవాబు అవును అనే అనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అదే నిజం అనిపిస్తున్నాయి. బ్యాంకులను ప్రైవేట్ పరం చేసే ఆలోచనలు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. దానికి మరింత బలం చేకూర్చే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు బ్యాంక్ యూనియన్లకు ఆగ్రహం కలిగిస్తున్నాయి.
ప్రైవేట్ మేలు అంటూ :
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దీని మీద కీలక వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల ఆర్థిక సంఘటితానికి అలాగే జాతీయ ప్రయోజనాలకు చేటు జరుగుతుంది అన్నది సరి కాదని ఆమె అన్నారు. ఇప్పటికి యాభై అయిదేళ్ళ క్రితం 1969లో జరిగిన బ్యాంకుల జాతీయకరణ వల్ల అనుకున్న ఫలితాలు రాలేదని ఆమె అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ వల్ల వర్తమానంలో ప్రభుత్వ బ్యాంకులు మరింత నిపుణతను సాధించలేకపోతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణ మీద మంచి జరుగుతుందని ఆమె అంటూ చెడు అన్నది అపోహ మాత్రమే అని చెబుతున్నారు.
విప్లవాత్మక సంస్కరణలు :
దేశంలో ఎన్డీయే ప్రభుత్వం 2014 నుంచి వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి లెక్కలేనన్ని విప్లవాత్మక సంస్కరణ చర్యలు తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విధాన స్థిరత్వం పారదర్శకత పెట్టుబడులను ప్రోత్సహించాయని ఆమె నొక్కి చెప్పారు. భారతదేశానికి చాలా పెద్ద ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని ఆమె అన్నారు క్రెడిట్ లభ్యతను విస్తరించడం ద్వారా వృద్ధికి మద్దతు ఇవ్వాలని ఆమె బ్యాంకింగ్ రంగాన్ని కోరారు.
భగ్గుమన్న యూనియర్లు :
అయితే బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటోంది. ఇది తప్పుడు నిర్ణయంగా ఉండబోతోంది అని స్పష్టం చేసింది. దేశంలో ప్రాధాన్యత రంగాలకు మేలు జరిగింది అంటే ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల వల్లనే అని పేర్కొంది. ప్రభుత్వ పధకాలు పేదలకు అందుతున్నాయంటే కూడా అది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్లనే అని సూచించింది.
జాతీయకరణతోనే :
గతంలో ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారు. దాని వల్ల బ్యాంకింగ్ రంగం గ్రామ స్థాయి దాకా విస్తరించింది. అంతే కాదు పేదలకు బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయని అంటారు పేదలు బ్యాంకులలోకి వెళ్ళి రుణాలు తీసుకునేలా అవకాశాలు పెరిగాయి. అలాగే తమ సొమ్ముకు భద్రత అన్నది దేశ ప్రజలకు అర్ధం అయింది. కేంద్రం జన ధన్ యోజన పేరుతో జీరో అమౌంట్ ఖాతాలను ప్రారంభిస్తే ప్రభుత్వ రంగంలోకి బ్యాకులలోనే 90 శాతం అవి జరిగాయి అనంది కూడా ఉంది.
ప్రైవేట్ తో జరిగేది ఇదే :
అదే సమయంలో బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే తిరిగి అర్బన్ ఏరియా ప్రజలకే పరిమితం అవుతాయి అని అంటున్నారు అంతే కాదు రుణాల మీద వడ్డీ రేట్లు అలవి కాని విధంగా పెంచుతారని అంటున్నారు పేదల బ్యాంకింగ్ హక్కులను వెనక్కి తీసుకోవడమే అవుతుందని అంటున్నారు. ఇది తిరోగమన చర్య అని కూడా చెబుతున్నారు. ఈ రోజున కూడా నూటికి తొంబై శాతం ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల వల్లనే పేదలకు మేలు జరుగుతోంది అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
ఇదీ కారణమా :
ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉండడం వల్ల రాజకీయంగా పలుకుబడి కలిగిన వారు భారీ ఎత్తున వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగనామం పెడుతున్నారు. దాంతో బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి వస్తోంది. ఇక వాటిని మాఫీ చేయడమే ఒక ప్రక్రియగా సాగిపోతోంది. దీని వల్ల పేదల సొమ్ము పెద్దలకే పోతోంది అన్నది కూడా ఉంది. దీనిని పూర్తిగా అరికట్టాలంటే ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం ఒక్కటే మార్గమని ఆర్ధిక సంస్కరణవాదులు అంటున్నారు. అయితే ప్రభుత్వాలు పాలకులు గట్టిగా వ్యవహరిస్తే ప్రభుత్వ బ్యాంకులకు ఉన్న మొండి బకాయిలను వెనక్కి తీసుకుని రావచ్చు అని ఆ విధంగా చేయలేకపోవడం వల్ల ఇపుడు ప్రైవేట్ తో మళ్లీ పేదలకే ఇబ్బంది అని అంటున్నారు. దీని మీద అయితే నిరసన వ్యక్తం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.