వైద్య శాస్త్రంలో సంచలనం: 50 ఏళ్ల నాటి అరుదైన బ్లడ్ గ్రూప్ మిస్టరీ వీడింది!

ఆస్ప‌త్రిలో రోగికి ఒక్కోసారి త‌ప్పుడు గ్రూప్ ర‌క్తాన్ని ఎక్కించిన కార‌ణంగా చ‌నిపోయిన సంద‌ర్భాలున్నాయి. రోగి ర‌క్త న‌మూనాతో స‌రిపోల‌ని ర‌క్తాన్ని ఎక్కించిన కార‌ణంగా ఈ ప్ర‌మాదం సంభ‌విస్తుంది.

Update: 2026-05-18 19:30 GMT

ఆస్ప‌త్రిలో రోగికి ఒక్కోసారి త‌ప్పుడు గ్రూప్ ర‌క్తాన్ని ఎక్కించిన కార‌ణంగా చ‌నిపోయిన సంద‌ర్భాలున్నాయి. రోగి ర‌క్త న‌మూనాతో స‌రిపోల‌ని ర‌క్తాన్ని ఎక్కించిన కార‌ణంగా ఈ ప్ర‌మాదం సంభ‌విస్తుంది. అయితే కొన్నిసార్లు రోగుల బ్ల‌డ్ గ్రూప్ ఏమిటో స‌రిగా ల్యాబ్ టెస్ట్ లో క‌నుగొన‌లేక‌పోతే ఎదుర‌య్యే ప్ర‌మాదాలు ఇలానే ఉంటాయి. అయితే ఇప్పుడు ద‌శాబ్ధాలుగా ఎవ‌రూ క‌నిపెట్ట‌లేక‌పోయిన ఒక కొత్త బ్ల‌డ్ గ్రూప్ ని సైంటిస్టులు క‌నుగొన్నారు. ఇది ఇప్పుడు వైద్య రంగంలో పెను విప్ల‌వంగా మారనుంది. బ్ల‌డ్ గ్రూప్ ని క‌నుగొన‌డంలో మ‌రింత అద‌నంగా పార‌ద‌ర్శ‌క ఏర్పాట్లు అందుబాటులోకి వ‌చ్చే వీలుంద‌ని స‌మాచారం. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

వైద్య రంగంలో ఐదు దశాబ్దాలుగా వీడని ఒక అరుదైన బ్లడ్ గ్రూప్ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. బ్రిటన్ - ఇజ్రాయెల్ దేశాలకు చెందిన పరిశోధకులు ఉమ్మడిగా శ్రమించి ఈ సంచలన ఆవిష్కరణ చేశారు. సాధారణంగా అందరికీ తెలిసిన ఏ, బి, ఓ , ఆర్‌హెచ్ బ్లడ్ గ్రూపులు కాకుండా మానవ రక్తంలో ఎన్నో రకాల యాంటిజెన్లు ఉంటాయి. అందులోని ఏఎన్‌డ‌బ్ల్యూజే (AnWj) అనే యాంటిజెన్ వెనుక ఉన్న జన్యువు ఏమిటనేది ఇన్నాళ్లూ ఒక పెద్ద ఫ‌జిల్‌గా మిగిలిపోయింది. ఈ తాజా పరిశోధనతో ఆ రహస్యం వెల్లడైంది.

శాస్త్రవేత్తలు ఈ సరికొత్త బ్లడ్ గ్రూప్ వ్యవస్థకు `మాల్` (ఎంఏఎల్‌) అని నామకరణం చేశారు. అంతర్జాతీయ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సొసైటీ దీనిని ప్రపంచంలోని 47వ అధికారిక బ్లడ్ గ్రూప్ సిస్టమ్‌గా గుర్తించింది. ఈ అరుదైన యాంటిజెన్‌ను మొదటిసారిగా 1972 లో కనుగొన్నారు. దీనిని తొలిసారి గుర్తించిన ఆంటోన్ -డ‌బ్ల్యూజే అనే ఇద్దరు రోగుల పేర్ల మీదుగానే దీనికి ఏఎన్‌డ‌బ్ల్యూజే అని పేరు పెట్టారు. డీఎన్‌ఏ విశ్లేషణ చేసే అధునాతన `హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ ద్వారా మాత్రమే ఈ మెడికల్ మిస్టరీని పరిష్కరించడం సాధ్యపడింది.

ఈ పరిశోధనలో వంశపారంపర్యంగా ఏఎన్‌డ‌బ్ల్యూజే-నెగిటివ్ రక్తాన్ని కలిగి ఉండే వ్యక్తులలో ఎంఏఎల్‌ జన్యు లోపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 99.9 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఏఎన్‌డ‌బ్ల్యూజే-పాజిటివ్ గానే ఉంటారు. వీరి ఎర్ర రక్త కణాల ఉపరితలంపై పూర్తి స్థాయి ఎంఏఎల్‌ ప్రోటీన్ ఉంటుంది. అయితే జన్యు లోపం ఉన్న అరుదైన వ్యక్తుల రక్తకణాలపై ఈ ప్రోటీన్ ఉండదు. ల్యాబ్‌లో సాధారణ మాల్ జన్యువును రక్తకణాల్లోకి ప్రవేశపెట్టి పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు.

ఈ అద్భుతమైన ఆవిష్కరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా అరుదైన బ్లడ్ గ్రూపులు ఉన్న రోగులకు రక్త మార్పిడి మరింత సురక్షితం కానుంది. తప్పుడు రక్తాన్ని ఎక్కించడం వల్ల జరిగే ప్రమాదకరమైన రోగనిరోధక ప్రతిచర్యలను దీని ద్వారా నివారించవచ్చు. ఈ జన్యు మూలాలు తెలియడం వల్ల సరికొత్త స్క్రీనింగ్ పరీక్షలను అభివృద్ధి చేసే అవకాశం లభించింది. వంశపారంపర్యంగా కాకుండా.. కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడినప్పుడు కూడా శరీరంలో ఈ మాల్ ప్రోటీన్ తాత్కాలికంగా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా జన్యుపరమైన ఈ ఏఎన్‌డ‌బ్ల్యూజే-నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ తాజా పరిశోధనలో ఒక అరబ్-ఇజ్రాయెలీ కుటుంబ సభ్యులతో కలిపి కేవలం ఐదుగురు వ్యక్తులను మాత్రమే జన్యుపరంగా గుర్తించారు. పుట్టుకతోనే ఈ జన్యు లోపం ఉన్నా కానీ వీరు మిగతా అందరిలాగే పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు. లూయిస్ టిల్లీ అనే సీనియర్ మహిళా సైంటిస్ట్ తన 20 ఏళ్ల కెరీర్‌ను ఈ మిస్టరీని ఛేదించడానికే అంకితం చేశారు. దీనికి సంబంధించిన పరిశోధనా పత్రం ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ `బ్లడ్`లో ప్రచురితమైంది.

Tags:    

Similar News