నేపాల్ లో ఉద్యమించిన ‘జెన్ Z’ అంటే ఏంటి? అసలు జెన్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి?
ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. దీనికి కారణం, ఆయా సంస్థలు నేపాల్ చట్టాలకు అనుగుణంగా నమోదు చేసుకోలేదని పేర్కొంది.;
నేపాల్ లో సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడంతోపాటు హింసాత్మక చర్యలకు దిగడంతో ఆ దేశంలో అత్యావసర పరిస్థితిని విధించారు. ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రజాగ్రహానికి ఏకంగా దేశాధినేత తోకముడవడం వెనుక ఎవరు ఉన్నారు? అనేది ప్రధాన చర్చకు దారితీయగా, ఈ ఆందోళనకు జెనరేషన్ జెడ్ (Gen Z) గ్రూపుగా చెబుతున్న యువత సారథ్యం వహించడం విశేషం.
నేపాల్‌లో 'జెన్ జెడ్' అనే పేరుతో ఒక నిర్దిష్ట ఉద్యమం జరగడం, ప్రభుత్వం దిగిపోవడం సంచలనమైంది. అయితే ఈ జెన్ జెడ్ గ్రూపు అనేది సాధారణ సామాజిక శాస్త్రానికి సంబంధించిన పదం కావడం విశేషం. ఒక తరం కోసం మాట్లాడే సందర్భంలో సామాజిక శాస్త్రంలో జెన్ పదాన్ని వాడుతుంటారు. జెన్ జెడ్ తరహాలోనే కొన్ని గ్రూపులులేదా సమూహాల కోసం ఆధునిక సామాజిక శాస్త్రంలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ శతాబ్దంలో పుట్టిన తొలి తరం వారి నుంచి ఇప్పటి తరం వరకు వయసుల వారీగా ఈ జెన్ గ్రూపులకు పేర్లు పెట్టారు. ఆధునిక సమాజంలో తరాలను విభజించడానికి ‘జెనరేషనల్ కోహోర్ట్స్’ అనే భావనను తీసుకువచ్చారు.
ఒకే కాలంలో పుట్టిన వ్యక్తులు, తమ జీవితంలోని కీలక దశలలో ఒకే విధమైన చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంఘటనలను చూస్తారు కాబట్టి, వారి ఆలోచనలు, విలువలు, నమ్మకాలలో సారూప్యత ఉంటుందని జర్మన్ సామాజిక శాస్త్రవేత్త కార్ల్ మ్యాన్హైమ్ 1923లో రచించిన "ది ప్రాబ్లెమ్ ఆఫ్ జెనరేషన్స్" లో ప్రస్తావించారు. ఆ తర్వాత ఆధునిక తరాలైన జెనరేషన్ గ్రూపులకు పేర్లు పెట్టి, వాటి లక్షణాలను విశ్లేషించినవారు విలియం స్ట్రాస్, నీల్ హోవ్. వీరు 1991లో రాసిన జనరేషన్స్ హిస్టరీ ఆఫ్ ఆమెరికా ఫ్యూచర్ 1584 టు 2069 అనే పుస్తకంలో ఈ భావనపై విస్తృతంగా చర్చించారు.
ఇక జెన్ Z" (Gen Z) అనేది సామాన్యంగా 1997 నుంచి 2012 సంవత్సరాల మధ్య జన్మించిన వారిని సూచించడానికి ఉపయోగిస్తున్నారు. వీళ్ళని డిజిటల్ నేటివ్స్ అని కూడా అంటారు, ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచీ ఇంటర్నెట్, సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లతో పెరగడం వల్ల ఈ పేరు పెట్టారు. ఇప్పుడు నేపాల్ లో ఉద్యమం చెలరేగడానికి ప్రధాన కారణం కూడా ఈ డిజిటల్ సౌలభ్యాన్ని వారికి దూరం చేయడమే అంటున్నారు. అవినీతి, ఆర్థిక అసమానతలు, యువతలో నిరుద్యోగం. ఈ సమస్యలపై ప్రజల ఆగ్రహం చాలా కాలంగా పేరుకుపోయింది. ఈ ఆగ్రహానికి, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సోషల్ మీడియా నిషేధం అగ్నికి ఆజ్యం పోసింది.
ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. దీనికి కారణం, ఆయా సంస్థలు నేపాల్ చట్టాలకు అనుగుణంగా నమోదు చేసుకోలేదని పేర్కొంది. అయితే నేపాల్ యువత మాత్రం ఈ చర్యను జీర్ణించుకోలేకపోయింది. ప్రధానంగా జెన్ జెడ్ గ్రూపు ఈ నిషేధాన్ని తీవ్రంగా పరిగణించింది. తాము పుట్టుకతో చూస్తున్న ప్రపంచం దూరమైనట్లు భావించి ప్రభుత్వంపై తిరుగుబాటుకు కారణమైంది. అయితే ఇలాంటి ఉద్యమం ఒక్క నేపాల్ లోనే కాకుండా గతంలో అమెరికా, స్వీడాన్, హాంకాంగ్‌లో కూడా జెన్ జెడ్ గ్రూపులు కొన్ని ఆందోళన నిర్వహించినట్లు చెబుతున్నారు.
ఇక జెన్ జెడ్ తరహాలో మరికొన్ని గ్రూపులు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైదని ది గ్రేటెస్ట్ జనరేషన్ (The Greatest Generation). 1901 నుంచి 1927 మధ్య జన్మించిన వారిని ఈ పేరుతో పిలుస్తారు. వీరు ప్రపంచ యుద్ధాలు చూసిన వారు కనుక గొప్ప జనరేషన్ గా అభివర్ణిస్తున్నారు. వీరి తర్వాత తరాన్ని సైలెంట్ జనరేషన్ (Silent Generation) అంటున్నారు. వీరు సుమారుగా 1928 నుంచి 1945 మధ్య జన్మించిన వారు అన్న మాట. ఈ కాలంలో పుట్టిన వారు ఎక్కువగా సైనికులుగా లేదా యుద్ధానంతర సమాజంలో భాగమయ్యారని అంటున్నారు.
ఇక 1945 తర్వాత జన్మించిన వారిని బేబీ బూమర్స్ (Baby Boomers)గా పిలుస్తున్నారు. వీరు 1946- 1964 మధ్య జన్మించిన వారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువగా జన్మించినవారిని బేబీ బూమర్స్ గా పిలుస్తారు. ఆ తర్వాత కాలంలో వారు అంటే 1965 నుంచి 1980 మధ్య జన్మించిన వారిని జనరేషన్ X (Generation X) అంటున్నారు. ఈ మధ్య కాలంలో జన్మించిన వారు సాధారణంగా స్వతంత్రంగా ఉంటుంటారని సామాజిక శాస్త్రం చెబుతోంది. ఇక ప్రస్తుత తరంలో అధిక సంఖ్యలో ఉన్నవారే మిలీనియల్స్ లేదా జనరేషన్ Y (Millennials or Generation Y). 1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారు. వీరు కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన సమయంలో పెరిగారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారు. వీరు పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో పెరిగారు. సామాజిక శాస్త్రం ప్రకారం ఈ గ్రూపులు అనేక సమస్యలు, అంశాలపై ఆన్ లైన్ వేదికగా స్పందిస్తున్నారు. తక్కువ సమయంలో ఏకమవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.