నెల్లూరు వైసీపీలో జెండా మోసేదెవరు.. ?
ఒకప్పుడు నెల్లూరు రాజకీయాల్లో వైసీపీ బలమైన పార్టీగా ఎదిగింది. 2019లో క్లీన్ స్వీప్ చేసిన.. వైసీపీ కేవలం ఐదేళ్లలో 2024 కు వచ్చే సరికి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.;
ఒకప్పుడు నెల్లూరు రాజకీయాల్లో వైసీపీ బలమైన పార్టీగా ఎదిగింది. 2019లో క్లీన్ స్వీప్ చేసిన.. వైసీపీ కేవలం ఐదేళ్లలో 2024 కు వచ్చే సరికి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. వైసీపీ తరఫున పోటీ చేసిన ఒక్కరు కూడా గెలిచింది లేదు. అదేసమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ తరఫున పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు విజయం దక్కించుకున్నారు.
ఇక, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. జిల్లా రాజకీయాలు రోజు రోజుకూ మారుతూ వచ్చాయి. ఈ క్రమంలో స్థానికంగా కూడా వైసీపీ తన బలం కోల్పోయింది. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి క్యూ కట్టారు. ముఖ్యంగా నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పల శ్రీనివాస్ యాదవ్.. పార్టీకి రాం రాం చెప్పారు. అదేవిధంగా వైసీపీకి బలంగా ఉన్న పలు డివిజన్ల కార్పొరేటర్లు కూడా.. ఆ పార్టీని వదిలి పెట్టారు. వీరంతా ఒకప్పుడు నెల్లూరు ఎమ్మెల్యే(మాజీ) పోలుబోయిన అనిల్ వర్గంగా ఉన్నారు.
కానీ, ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి.. వైసీపీని వీడి సైకిల్ ఎక్కేయడంతో ఆ పార్టీ హవా ఎక్కడా కనిపించడం లేదు. పైగా జెండా మోసే నాయకులు కానీ.. కార్యకర్తలు కానీ.. కనిపించడం లేదు. వాస్తవానికి నగర అధ్యక్షుడు బలంగా ఉండడంతో తొలి ఆరు మాసాలు బాగానే ఉందని అనుకున్నా.. ఆయనే పార్టీ మారడంతో అందరూ పార్టీని వదిలేశారు. ఈ క్రమంలోనే పలువురు వైసీపీ నేతలు.. టీడీపీ బాట పట్టారు. దీంతో ఇప్పుడు ఎటు చూసినా.. టీడీపీ జెండాలు.. మంత్రి నారాయణ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి.
దీంతో నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిందని చెబుతున్నారు. కేసులకు భయపడుతున్నవారు కొందరు అయితే.. మరికొందరు.. పార్టీ పరిస్థితి బాగోలేదని చెబుతూ.. ఇంటికే పరిమితం అవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పార్టీని వదిలేసి చాలా రోజులు అయింది. ఈ నేపథ్యంలో పార్టీని ఎవరు కాపాడుకుంటారన్నది ప్రశ్నగా మారింది. నిజానికి ఒకప్పుడు నెల్లూరు గడ్డపై వైసీపీ హవా చలాయించగా.. ఇప్పుడు అదే చోట పార్టీ కళావిహీనంగా మారిపోవడం గమనార్హం.