డిమాండ్లకు ఓకే.. చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్న సీజేపీ సంచలన ప్రకటన
కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చలు సానుకూలంగా ముగియడంతో తమ నిరసన కార్యక్రమాలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చలు సానుకూలంగా ముగియడంతో తమ నిరసన కార్యక్రమాలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరడంతో పాటు మిగిలిన రెండు కీలక డిమాండ్లపైనా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని సీజేపీ నాయకులు సౌరవ్, అశుతోష్ వెల్లడించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ ప్రతినిధులు మరోసారి సమావేశమయ్యారు. ఈ చర్చల్లో విద్యార్థుల డిమాండ్లు, భవిష్యత్‌లో పరీక్షల నిర్వహణ, నిరసనకారులపై నమోదైన కేసులు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఇరు పక్షాలు కీలక నిర్ణయాలను ప్రకటించాయి.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీజేపీ ప్రతినిధులు, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఢిల్లీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన కేసులను కూడా ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల్లో కేసుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇకపై ఈ అంశంలో పాల్గొన్న విద్యార్థులను కేసులతో వేధించబోమని కూడా స్పష్టమైన భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
అంతేకాకుండా నీట్ లీకేజీ ఘటన కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సీజేపీ వెల్లడించింది. అలాగే దేశంలోని ప్రవేశ పరీక్షల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం, పారదర్శకత పెంచడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టే అంశాలపై కూడా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఢిల్లీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నమోదైన కేసులను ఉపసంహరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావడానికి ఇప్పటికే ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. అలాగే నీట్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల నేపథ్యంలో తమ ఆందోళనలను అధికారికంగా విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. దేశం నలుమూలల నుంచి నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువత ప్రశాంతంగా తమ ఇళ్లకు చేరుకోవాలని పార్టీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటనతో ఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. భద్రతా కారణాల వల్ల తాత్కాలికంగా మూసివేసిన మెట్రో స్టేషన్లను కూడా అధికారులు తిరిగి తెరిచారు. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా తెరపడినట్లైంది.